
రైతన్నకు ఎరువు కష్టాలు!
ఎరువు కోసం మూడు
రోజులుగా తిరుగుతున్నాం..
ఎరువు కోసం మూడు రోజులుగా బొబ్బిలికి 12 కిలోమీటర్ల దూరంలోని కమ్మవలస నుంచి బస్సులో వచ్చి వెళ్తున్నాం. యూరియా, డీఏపీ కావాలి. మొక్కజొన్న, వరివెద, తదితర పంటలకు అవసరమైన యూరియా కోసం రోజూ తిరగాల్సి వస్తోంది. గతంలో ఇటువంటి పరిస్థితి లేదు. – రాగాల లోకనాథం,
కమ్మవలస, బొబ్బిలి మండలం
బొబ్బిలి/బాడంగి:
రైతన్నకు ఎరువు కష్టాలు ఆరంభమయ్యా యి. ఎరువుల కోసం పల్లెల నుంచి పట్టణాల్లోని ప్రైవేటు దుకాణాలకు పరుగుతీయాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ ఆధార్ కార్డులు పట్టుకుని గంటల తరబడి క్యూ కట్టాల్సి వస్తోంది. అప్పటికీ ఎరువు దొరకకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. వ్యయప్రయాసలకు గురవుతున్నారు. ఎరువుల కోసం చెప్పులు, సంచులు లైన్‌గా పెట్టుకునే రోజులను కూటమి ప్రభుత్వం మళ్లీ తెచ్చిందంటూ వాపోతున్నారు. గతంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఖరీఫ్ సీజన్ ముందే రైతన్నకు కావాల్సిన ఎరువు అందేది. ఎలాంటి వ్యయప్రయాసలు లేకుండా ఎరువు ఇంటికి చేరేది. వైఎస్సార్ రైతు భరోసా పథకం ఏటా పెట్టుబడి సాయం అందేది. పంట సాగుకు ధీమా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని, ఆర్‌బీకేలను ఆర్‌ఎస్‌కేలుగా పేరుమార్చడమే తప్ప కూటమి ప్రభుత్వం రైతుకు చేసిన సాయం శూన్యమని విమర్శిస్తున్నారు. పంటల సాగు సమయంలో పొలాల్లో ఉండాల్సిన రైతులు ఎరువుల కోసం తిరగాల్సి వస్తోందంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రైతన్న ఎరువు కష్టాలను వ్యవసాయ శాఖ ఏడీ ఎం.శ్యాంసుందర్ వద్ద ప్రస్తావించగా యూరియా కొరత లేదని, అన్ని రైతు సేవా కేంద్రాల్లో నిల్వలున్నాయని, వీటిని ఈనెల 5 నుంచి పంపిణీ చేస్తామని చెప్పారు. రైతులు నిల్వ చేసుకోవడానికి తీసుకువెళ్తున్నారే తప్ప ఇప్పుడు అంత అవసరం లేదన్నారు.

రైతన్నకు ఎరువు కష్టాలు!