
అవిశ్వాసంపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై ఏదీ?
బొబ్బిలి: కూటమి నాయకులు బొబ్బిలి పట్టణంలోని అభివృద్ధి పనులను విస్మరించి అవిశ్వాసంపైనే దృష్టిసారించారని వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు చోడిగంజి రమేష్ నాయుడు విమర్శించారు. పలువురు కౌన్సిలర్లతో కలిసి మీడియాతో గురువారం మాట్లాడారు. మున్సిపాలిటీలో చేపట్టాల్సిన 15వ ఆర్థిక సంఘం, సాధారణ నిధులకు సంబంధించిన అనేక పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయినా పట్టించుకోని పాలకులు.. అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టి అధికార మార్పిడికి ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. కూటమి నాయకుల తీరును పట్టణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. పదవుల కాంక్షవల్ల పరిమిత కాలంలో వినియోగించాల్సిన నిధులు వెనుకకు మళ్లే ప్రమాదముందన్నారు. పదవులకన్నా అభివృద్ధి పనులకు పెద్దపీట వేసి పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఆయన వెంట 16వ వార్డు కౌన్సిలర్ సవలాపురపు రామకృష్ణ(బాబు ) ఉన్నారు.
డీసీసీబీ నికర లాభం రూ.7.66 కోట్లు
● ఏ కేటగిరీ వాటాదారులకు
రూ.1.09 కోట్ల డివిడెండ్ ప్రకటన
విజయనగరం అర్బన్: గడచిన ఆర్థిక సంవత్సరంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు రూ.7.66కోట్ల నికర లాభం ఆర్జించినట్టు డీసీసీబీ పర్సన్ ఇన్‌చార్జి, జేసీ ఎస్.సేతుమాధవన్ తెలిపారు. కలెక్టరేట్‌లోని జేసీ చాంబర్‌లో గురువారం జరిగిన సభలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి లావాదేవీల ముగింపునకు సంబంధించిన స్టాట్యూటరీ ఆడిట్ నివేదికను, లాభనష్టాల నివేదికపై బ్యాంకు సీఈఓ సీహెచ్ ఉమామహేశ్వరరావుతో కలిసి చర్చించారు. బ్యాంకును లాభాలబాటవైపు నడిపించిన సహకార సంఘాలు, డీసీసీబీ సిబ్బందిని అభినందించారు. నాబార్డు, ఆప్కాబ్ బ్యాంకులకు జేసీ కృతజ్ఞతలు తెలిపారు. బ్యాంకుకు చెందిన ఏ–క్లాస్ వాటాదారులకు లాభాల్లో ఒక శాతం రూ.1.09 కోట్లు డివిడెండ్‌గా ప్రకటించినట్టు తెలిపారు. మహాజనసభలో జిల్లా సహకార అఽధికారి పి.రమేష్, నాబార్డు డీడీఓ టి.నాగార్జున, ఆప్కాబ్ డీజీఎం అప్సజహాన్, మహాజన సభ్యులు పాల్గొన్నారు.
19న బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక
● స్థానిక సంస్థల ప్రత్యక్షేతర సీట్ల ఖాళీలకు ఎన్నికలు
విజయనగరం అర్బన్: జిల్లాలోని స్థానిక సంస్థలల్లో ఖాళీగా ఉన్న ప్రత్యక్షేతర ప్రజాప్రతినిధుల ఉప ఎన్నికలను ఈ నెల 19న నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్నిక ప్రక్రియ షెడ్యూల్‌ను జేసీ సేతుమాధవన్ గురువారం విడుదల చేశారు. బొబ్బిలి మున్సిపాలిటీలో చైర్మన్ పదవి, కొత్తవలస మండల పరిషత్‌లో కో–ఆప్టెడ్ మెంబర్, గరివిడి మండలంలోని సేరిపేట పంచాయితీలో ఉప సర్పంచ్ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. ఏపీ మున్సిపాలటీలు, పంచాయతీ రాజ్ చట్టాలకు అనుగుణంగా ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. ఎన్నికలు ప్రజా స్వామ్యయుతంగా నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.

అవిశ్వాసంపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై ఏదీ?