
జాతీయ రహదారిపై కారు దగ్ధం
ఆరిలోవ: జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ప్రయాణిస్తున్న ఒక కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తు కారులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. మధురవాడ నుంచి నగరానికి వెళ్తున్న ఒక కారు జూ పార్కు సమీపంలోకి రాగానే పొగలు రావడం డ్రైవర్ గమనించాడు. వెంటనే అప్రమత్తమై కారును రోడ్డు పక్కన నిలిపివేశాడు. కారు ఆపిన వెంటనే మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. ఈ ఘటనతో వెనుక వస్తున్న ఇతర వాహనదారులు భయపడి సుమారు అర కిలోమీటరు దూరంగా తమ వాహనాలను నిలిపివేశారు. కారులో ఉన్నవారు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఆరిలోవ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే మంటలు తీవ్రంగా ఎగిసిపడుతున్నాయి. సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. కారు లోపల షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. ఈ ఘటనపై ఆరిలోవ పోలీసులు ప్రమాదవశాత్తు కారు దగ్ధమైనట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.