
ఘనంగా ఈఎంబీఏ స్వాగత వేడుకలు
తగరపువలస: ఆనందపురం మండలం గంభీరంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ప్రాంగణంలో ఆదివారం ఎగ్జిక్యూటివ్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్టేషన్ (ఈఎంబీఏ) రెండో బ్యాచ్ స్వాగత వేడుక నిర్వహించారు. ప్రోగ్రాం చైర్మన్ ప్రొఫెసర్ హాపీ బాల్ మాట్లాడుతూ ఈఎంబీఏ ప్రోగ్రామ్‌ను నిపుణులు బాగా స్వీకరిస్తున్నందున ఈ బ్యాచ్‌లో 25 శాతం పెరుగుదల నమోదు చేసుకుందన్నారు. అడ్మిషన్ చైర్ ప్రొఫెసర్ కావేరి కృష్ణన్ 2024–26 ఈఎంబీఏ బ్యాచ్ ప్రొఫైల్ సారాంశాన్ని సమర్పించారు. ఈ బ్యాచ్‌లో తయారీ, ఐటీ, బ్యాంకింగ్, కన్సల్టింగ్, ఈ కామర్స్, టెలీకమ్యూనికషన్, రిటైల్ తదితర పరిశ్రమల నుంచి 180 మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారన్నారు. పాల్గొనేవారిలో 28 శాతం మంది మహిళలు పదేళ్ల సగటు అనుభవం కలిగినవారు ఉన్నారన్నారు. లార్సన్ అండ్ టూబ్రో కార్పొరేట్ అండ్ లెర్నింగ్ విభాగాధిపతి ఎంవీఎన్ రావు, టైమ్స్ ప్రో సీఈవో అనీష్ శ్రీకృష్ణ, ఐఐఎం డైరెక్టర్ ఎం.చంద్రశేఖర్ తదితరులు మాట్లాడుతూ విద్యార్థులకు అద్భుతమైన అభ్యాసన అనుభవాన్ని అందించడానికి ఐఐఎం కట్టుబడి ఉందన్నారు. సమకాలీన నిర్వహణ దృశ్యాలను ప్రతిబింబించేలా కేస్ స్టడీలను అభివృద్ధి చేసుకోడానికి అధ్యాపకులు పరస్పర సహకారంతో ప్రోత్సహించుకోవాలన్నారు. వారి సామర్థ్యాలను గరిష్టస్థాయికి చేరుకునేలా ప్రోత్సహిస్తామన్నారు. అనంతరం 2023–25 బ్యాచ్‌లో మెరిట్ విద్యార్థులకు సర్టిఫికెట్లతో సత్కరించారు. అకడమిక్ అండ్ రీసెర్చ్ కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ శివశంకర్ పటేల్ పాల్గొన్నారు.

ఘనంగా ఈఎంబీఏ స్వాగత వేడుకలు