
నడక.. నరకం
ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రోడ్లే ముఖ్యం. రోడ్లు ఉంటే రవాణా వ్యవస్థ మెరుగుపడుతుంది.. తద్వారా రాకపోకలు పెరిగి ప్రజలు వ్యాపార పరంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు.. అయితే ఏళ్ల క్రితం మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాలు, కొత్తగా వెలసిన కాలనీలకు రోడ్లు లేక అభివృద్ధికి నోచుకోవడం లేదు. వీధి దీపాలు లేక అంధకారంలో ఉంటున్నాయి. మున్సిపాలిటీల్లో అంతర్గత రహదారులు, విద్యుత్ సమస్యలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు
అధ్వానంగా అంతర్గత రోడ్లు
● చిన్నపాటి వర్షానికే బురదమయం ● మట్టి పోసి మమ అనిపిస్తున్న అధికారులు ● విద్యుత్ కోతలతో అవస్థలు ● వర్షం పడితే గంటల తరబడి బంద్ ● ఇబ్బందుల్లో ప్రజలు
వికారాబాద్: మున్సిపాలిటీల్లో అంతర్గత రోడ్లు అభివృద్ధికి నోచుకోక అధ్వానంగా తయారయ్యాయి. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉండగా అన్నింటిలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో వేసిన లేఅవుట్లు, వెంచర్లలో కూడా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయలేదు. రోడ్లపై మట్టిపోసి మమ అనిపించారు. అధికారులు సైతం మామూళ్లకు అలవాటు పడి కనీస సౌకర్యాలు ఉన్నాయా..? లేదా..? అని కూడా చూడటం లేదు. మెజార్టీ కాలనీల్లో మట్టి రోడ్లే దర్శనమిస్తున్నాయి. కాస్త వర్షం కురిసినా దారులు పూర్తిగా చిత్తడిగా మారుతున్నాయి. కొన్ని కాలనీల్లోకి ద్విచక్ర వాహనాలు కూడా వెల్లలేని పరిస్థితి ఉంది. నడుచుకుంటూ వెళ్లాలన్నా భయం వేస్తోందని పలువురు పేర్కొన్నారు. జిల్లా కేంద్రం వికారాబాద్‌లో 80వేల జనాభా ఉండగా ఆయా గ్రామాల నుంచి రోజూ 20వేల నుంచి 30వేల మంది ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. ప్రస్తుతం వికారాబాద్ మున్సిపల్ పరిధిలో 35 కిలోమీటర్ల పొడవున సీసీ రోడ్లు ఉండగా మరో 60 కిలోమీటర్లకు పైగా సీసీ అవసరం ఉంది.
కరెంటు కోతలతో సతమతం
రోజురోజుకూ కరెంటు కోతలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఆరు నెలలుగా ఈ సమస్య మరింత పెరిగింది. విద్యుత్ వ్యవస్థలో ఉన్న చిన్నచిన్న సమస్యల కారణంగా కోతలు విధించాల్సి వస్తోంది. వర్షం పడినంతసేపు కరెంటు కట్ చేస్తున్నారు. రాత్రి సమయంలో కోతల కారణంగా ప్రజలు నిద్రపోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తోంది. కాలం చెల్లిన ఐరన్ స్తంభాలు ప్రమాదకరంగా మారాయి. పలు చోట్ల విద్యుత్ తీగలు చెట్లకు తాకుతుండటం, గాలి తీవ్రతకు తీగలు తెగి పడటం లాంటివి చోటు చేసుకుంటున్నాయి. కలెక్టరేట్‌కు వెళ్లే దారి వీధి దీపాలు లేవు. దీంతో అంధకారం నెలకొంది.

నడక.. నరకం