
చినుకు పడితే చిత్తడే
కొడంగల్: కొడంగల్ మున్సిపల్ పరిధిలోని పలు గ్రామాల్లో చినుకు పడితే చిత్తడిగా మారుతోంది. మున్సిపల్‌లో విలీనమైన గ్రామాల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కొడంగల్ మేజర్ గ్రామ పంచాయతీకి 2018లో మున్సిపల్ హోదా లభించింది. అప్పట్లో కొండారెడ్డిపల్లి, గుండ్లకుంట, పాత కొడంగల్, పాత కొడంగల్ తండా, బూల్కాపూర్, ఐనన్‌పల్లి గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేశారు. ఈ గ్రామాల్లో మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించిందని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. బూల్కాపూర్‌లో మైసమ్మ దేవాలయానికి వెళ్లే దారిలో మురుగు నీరు రోడ్డుపై నిలుస్తోంది. దీంతో గ్రామస్తుల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఈ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగు నీరు రోడ్లపైకి వస్తోంది. బూల్కాపూర్‌లో మురుగు కాల్వలు లేవు. వ్యక్తిగత మరుగుదొడ్లు లేవు. గ్రామానికి వెళ్లే దారిలో రోడ్డుకు ఇరువైపులా గ్రామస్తులు బహిర్భుమికి వెళ్తున్నారు. గ్రామంలోకి వెళ్లాలంటేనే ఇబ్బందిగా ఉంది. వర్షాకాలంలో గ్రామంలో రాకపోకలకు ఇబ్బందిగా ఉంది.