
విదేశీ వస్తువులను బహిష్కరించాలి
పరిగి/కుల్కచర్ల: విదేశీ వస్తువులను బహిష్కరించాలని స్వదేశీ జాగరన్ మంచ్ రాష్ట్ర నాయకుడు, ప్రముఖ వక్త బెంగాల్ ఈశ్వర్ అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలో స్వదేశీ జాగరన్ మంచ్ ఆధ్వర్యంలో శ్రీసాయి ఒకేషనల్ కళాశాలలో స్వదేశీ వస్తువుల ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. నేడు దేశంలో స్వదేశీ అనేది ఒక ఉద్యమంలా సాగాలని సూచించారు. విదేశీ వ్యాపార సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర వాటిలో వస్తువులు కొనుగోలు చేయొద్దని సూచించారు. ఈ కామర్స్ వల్ల దేశంలోని 3 లక్షలకు పైగా చిన్న చిన్న దుకాణాదారులు రోడ్డున పడ్డారన్నారు. మన సాంస్కృతిక సంప్రదాయాలను మనమే కాపాడుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో విభాగ్ కన్వీనర్ ప్రభాకర్‌రెడ్డి, కళాశాల డైరెక్టర్ రాముయాదవ్, ప్రిన్సిపాల్ శ్రీశైలం, హరిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కుల్కచర్ల మండల కేంద్రంలోని కృష్ణవేణి పాఠశాలలో స్వదేశీ జాగరణ మంచ్ కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.