
ఆటో నుంచి కిందపడి వ్యక్తి మృతి
కొడంగల్ రూరల్: ఆటో నుంచి కిందపడిన ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని చిట్లపల్లి టోల్‌ప్లాజా దగ్గర చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన మహ్మద్‌అలీ(65) తన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. సోమవారం మొహరం(పీర్ల పండగ)సంతాప దినాలను పురస్కరించుకొని స్వగ్రామానికి బయలుదేరారు. నగరం నుంచి కొడంగల్ చేరాక, ఇక్కడి నుంచి రుద్రారానికి ఆటోలో వెళ్లారు. మార్గమధ్యలో చిట్లపల్లి టోల్ ప్లాజా సమీపంలో స్పీడ్ బ్రేకర్ దాటుతున్న క్రమంలో అకస్మాత్తుగా మహ్మద్‌అలీ ఆటోలో నుంచి జారి కింద పడ్డారు. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ని చికిత్స నిమిత్తం కొడంగల్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుమారుడు యూసుఫ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.
మట్టి దందా నిలిపివేత
దోమ: మల్లేపల్లితండా, దాదాపూర్ గ్రామాల సమీపంలో కొన్ని రోజులుగా కొందరు అక్రమార్కులు యథేచ్చగా కొనసాగుతున్న మట్టి దందాను రెవెన్యూ అధికారులు నిలిపివేశారు. శనివారం శ్రీసాక్షిశ్రీదినపత్రికలో శ్రీతోడేస్తున్నారుశ్రీఅనే కథనం ప్రచురితమైంది. ఇందుకు స్పందించిన రెవన్యూ అధికారులు సోమవారం ఘటనా స్థలికి చేరుకుని తవ్వకాలను నిలిపివేసే చర్యలు చేపట్టారు. వాహనాలను వదిలేసి, ఎలాంటి ఫెనాల్టీలు విధించనట్లు సమాచారం. అక్రమార్కులపై తహసీల్దార్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
పాఠశాల సమయానికి బస్సులు నడిపించాలి
కొడంగల్ రూరల్: పాఠశాలల సమయానికి బస్సులను నడిపించాలని ఎంఈఓ రాంరెడ్డి అన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. తాండూరు ఆర్టీసీ డిపో అధికారులకు బస్సులను పాఠశాలల సమయానికి నడిపించాలని కోరినట్లు ఆయన తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8.45గంటలకు కొడంగల్‌కు బస్సులు చేరేటట్లు చర్యలు తీసుకోవాలని, కొడంగల్ నుంచి సాయంత్రం 4.40గంటలకు తిరుగు ప్రయాణం అయ్యేటట్లు చర్యలు తీసుకోవాలని కోరినట్లు కోరారు.