
సర్కారు బడికి రాంరాం!
ఏటా తగ్గుతున్న విద్యార్థుల నమోదు
వికారాబాద్: ప్రభుత్వ పాఠశాలలపై చాలామంది తల్లిదండ్రులకు నమ్మకం కుదరడం లేదు. నిష్ణాతు లైన ఉపాధ్యాయులు ఉన్నా..ఫీజుల బాధ లేకు న్నా .. ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, మ ధ్యాహ్న భోజన సదుపాయం కల్పిస్తున్నా చాలా మంది ప్రైవేటుకే మొగ్గుచూపుతున్నారు. గడిచిన ప దేళ్ల కాలంలో విద్యా వ్యవస్థలో వేగంగా చోటు చేసుకుంటున్న మార్పులతో ప్రభుత్వ బడులకు ప్రైవేటు స్కూళ్లు సమాంతర వ్యవస్థగా తయారయ్యాయి. గ తంలో పట్టణ ప్రాంత వాసులు మాత్రమే వారి పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చేర్చేవారు. ప్రస్తుతం గ్రా మీణ ప్రాంత ప్రజలు కూడా ప్రైవేటు బాట పట్టా రు. ఇది సర్కారు బడులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.గడిచిన నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్య 40శాతం మేర తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి.జిల్లాలో 1,0 63 ప్రభుత్వ బడులు ఉండగా84,208 మంది విద్యార్థులు ఉన్నారు.185 ప్రైవేటు పాఠశాలల్లో 45,042 మంది విద్యార్థులు చదువుకొంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే సర్కారు బడులకు గడ్డు కాలమే నని విద్యా వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బడికి పంపడంలోనూ వివక్ష
పురుషాధిక్య సమాజంలో అనేక రూపాల్లో లింగవివక్ష అనాదిగా కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే.. బాల్య వివాహాలు, ఇంట్లో పనులు చేసే విషయంలో, పునర్వివాహాల్లో లింగవివక్ష కొట్టొచ్చి నట్లు కనిపించేది. గతంలో మగపిల్లలను బడులకు పంపి ఆడపిల్లలకు చదువెందుకులే అంటూ చిన్నచూపు చూసేవారు. బ్రూణహత్యల్లోనూ లింగవివక్ష కనిపించేది. తాజాగా చిన్నారులను బడులకు పంపించే విషయంలోనూ లింగవివక్ష స్పష్టంగా కనిపిస్తోంది. పట్టణాల్లో బాల బాలికలిద్దరినీ వారి ఆర్థిక స్తోమతను బట్టి ప్రైవేటు స్కూళ్లకు పంపిస్తుండగా.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం వివక్ష కనిపిస్తోంది. ఇంట్లో ఒక ఆడపిల్ల ఒక మగ పిల్లాడు ఉంటే వారిలో కుమారుడిని ప్రైవేటుకు కుమార్తెను ప్రభుత్వ బడికి పంపుతున్నారనే వాదన వినిపిస్తోంది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు జరిపిన సర్వేల్లో కూడా ఈ విషయం స్పష్టమవుతోంది. ప్రస్తుతం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు బడులలో నమోదవుతున్న బాలబాలికల నిష్పత్తి గమనిస్తే కూడా ఈ విషయం నిజమనే అనిపిస్తుంది. ప్రైవేటులో విద్యార్థుల సంఖ్య 24,773 ఉండగా బాలికలు 20,269 మంది ఉన్నా రు. అంటే బాలికల కంటే బాలురు సంఖ్య 4,504 మంది ఎక్కువ. అదే ప్రభుత్వ బడులలో బాలుర సంఖ్య 41,285 ఉండగా.. బాలికలు 42,923 మంది ఉన్నారు. అంటే బాలుర కంటే బాలికలు 1,638 మంది అధికంగా నమోదయ్యారు.
గడిచిన నాలుగేళ్లలో ప్రభుత్వ బడులలో విద్యార్థుల నమోదు సంఖ్య ఇలా..
విద్యా సంవత్సరం చేరిన విద్యార్థులు
2022 – 23 9,085
2023 – 24 7,784
2024 – 25 7,078
2025 – 26 6,124
నమోదుపై పది ఫలితాల ప్రభావం
పదో తరగతి ఫలితాలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదుపై ప్రభావం చూపుతున్నాయి. పది ఫలితాల్లో జిల్లా ప్రతిసారీ చివరి స్థానంలో నిలుస్తోంది. దీంతో తల్లిదండ్రులు పిల్లలను సర్కారు బడిలో చేర్చేందుకు జంకుతున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా విద్యాశాఖ దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. పదేళ్ల క్రితం ప్రభుత్వ బడులల్లో ఒకటవ తరగతిలో 9,500 మంది విద్యార్థులు నమోదు కాగా ఈ ఏడాది 6,124 మందితో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. ప్రైవేటు స్కూళ్లలో మాత్రం 2,640 మంది నుంచి 7,522 మందికి చేరడం సర్కారు బడుల పనితీరుకు అద్దం పడుతోంది.
నాలుగేళ్లలో 40శాతం కిందకు..
ప్రభావం చూపుతున్న పది ఫలితాలు
ప్రైవేటుకే మొగ్గు చూపుతున్న తల్లిదండ్రులు
పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా ఆశించిన మేర ఫలితాలు రావడం లేదు. విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా ఏటా బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా బాలకార్మికులను స్కూళ్లలో చేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇవేవీ విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కలసిరావడం లేదు. ఎప్పటి లాగే ఈసారి కూడా సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గింది.
పిల్లల సంఖ్య పెంచేందుకు కృషి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నాం. పదో తరగతి ఫలితాల్లో వెనుకబడటానికి గల కారణాలను అన్వేషిస్తున్నాం. రెండేళ్ల క్రితం 65శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత కాగా గత ఏడాది 73.97 శాతంతో కాస్త మెరుగైన ఫలితాలు సాధించాం. ఈ సారి వంద సాతం ఫలితాల కోసం కృషి చేస్తున్నాం. ప్రభుత్వ బడులపై నమ్మకం కలిగించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నాం.
– జి.రేణుకాదేవి, డీఈఓ

సర్కారు బడికి రాంరాం!