
మార్కెట్ యార్డు దశ మారేనా?
కొడంగల్: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఏర్పడి సుమారు మూడు దశాబ్దాలు కావసస్తోంది. నాటి నుంచి నేటి వరకు అందులో క్రయ విక్రయాలు జరగ లేదు. యార్డులోని దుకాణాలు నిరుపయోగంగా ఉన్నాయి. అయినా జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. గతం నుంచి నిర్లక్ష్యానికి గురైన కొడంగల్ మార్కెట్ యార్డు దశ ఇప్పుడైనా మారుతుందేమోనని రైతులు, వ్యాపారులు ఎదురు చూస్తున్నారు. 1994న అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కొడంగల్ ఉప మార్కెట్ యార్డుకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతరైతులకు యార్డును అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో శ్రీకారం చుట్టారు. అయితే కొంతకాలం సజావుగా సాగిన క్రయవిక్రయాలు కొద్ది నెలలకే ఆగిపోయాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యాపారం జరగడం లేదు. యార్డు ఏర్పడి 30 ఏళ్లు దాటినా అధికారులు పట్టించుకోవడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మార్కెట్ యార్డుకు మహర్దశ వస్తుందనిరైతులు భావించారు. అయితే వారి ఆశలు అడియాశలయయ్యాయి.
40 వేల హెక్టార్లలో సాగు
కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్‌పేట, దుద్యాల్ మండలాల్లో సుమారు 40 వేల హెక్టార్లలో పంటలు సాగవుతాయి. కంది, పత్తి, పెసర, మినుము, వరి, జొన్న వంటి పంటలు వేస్తారు. మార్కెట్ యార్డ్ అందుబాటులో లేకపోవడంతో పంట దిగుబడిని దళారులకు విక్రయించి రైతులు మోసపోతున్నారు. ధరలోనూ తూకంలోనూ అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసస్తున్నారు. సరైన మార్కెట్ సౌకర్యం లేకపోవడం వల్ల ఆరుగాలం కష్టించి పండిన పంటను దళారులకు అమ్ముకోవాల్సి వస్తోందని పలువురు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని నల్లరేగడి భూముల్లో కంది పంట ఎక్కువగా పండుతోంది. ఇక్కడ పండించిన కందులకు తాండూరు, కర్నూల్, మహారాష్ట్రల్లో మంచి డిమాండ్ ఉంది. మార్కెట్ యార్డును తిరిగి ప్రారంభిస్తే మేలు జరుగుతుందని ఈ ప్రాంత రైతులు భావిస్తున్నారు.
రూ.3 కోట్లతో గోదాం నిర్మాణం
స్థానిక మార్కెట్ యార్డు ఆవరణలో రూ.3 కోట్ల వ్యయంతో భారీ గోదాం నిర్మించారు. ఈ గోదాంలో 5వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉంది. ప్రస్తుతం దీనన్ని వివిధ పనులకు వినియోగిస్తున్నారు. ఈ ప్రాంతంలోని రైతులు కంది, పత్తి, వరి, పెసర, మినుము పంటలను అధికంగా పండిస్తున్నారు. మార్కెట్ యార్డును తిరిగి ప్రారంభిస్తే ఈ గోదాం రైతులకు ఉపయోగపడుతుంది.కొడంగల్ మార్కెట్ యార్డు ఆవరణలో ఈ మధ్య కాలంలో 10 దుకాణాలు నిర్మించారు. వాటికి అద్దె నిర్ణయించి వేలం ద్వారా వ్యాపారులకు కేటాయించారు.
మూడు దశాబ్దాలుగా నిరుపయోగం
క్రయవిక్రయాలు లేక వెలవెల
పట్టించుకోని అధికార యంత్రాంగం