
కర్షకలోకం పొలంబాట
బషీరాబాద్: ఖరీఫ్ సీజన్ కావడంతో పల్లెల్లో కర్షకులు సాగు పనుల్లో బిజీ అయ్యారు. సూర్యోదయంతో పొలం బాటపడుతున్నారు. నాలుగైదు రోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షాలతో పంటలకు జీవం పోసినట్లయింది. బషీరాబాద్ మండలంలో సుమారు పది వేల ఎకరాలకు పైగా కంది, పత్తి, పెసర, మినుము పంటలు సాగు చేస్తున్నారు. ఈ ఖరీఫ్‌లో మే చివరి వారం నుంచే విత్తనాలు వేశారు. అయితే విత్తిన తర్వాత వారం పదిరోజులు వర్షాలు కురవక పోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. ఎట్టకేలకు వర్షాలు కురుస్తుండటంతో పంటలకు జీవం పోసినట్లయింది.
పగటిపూట పల్లెలు ఖాళీ..
రైతులు, రైతు కూలీలు కలుపుతీత, విత్తనాలు వేయడం వంటి పనులు ముమ్మరంగా చేస్తున్నారు. దీంతో పగటి పూట జనాలు లేక గ్రామాలు బోసిపోతున్నాయి. మండలంలోని కాశీంపూర్, మంతట్టి, రెడ్డిఘనాపూర్, గొట్టిగఖుర్ధు, గొట్టిగకలాన్, నవల్గా, జీవన్గీ, క్యాద్గిరా, గంగ్వార్, ఇందర్‌చెడ్, నావంద్గి, ఎక్మాయి, మర్పల్లి, పర్వత్‌పల్లి, దామర్‌చెడ్ గ్రామాల్లో సాగు చేసిన పంటలు ఆశాజనకంగా ఉన్నాయి. పంట సాల్ల నడుమ దంతె, గుంటుక తోలుతున్నారు. ఇందర్‌చెడ్, దామర్‌చెడ్, నీళ్లపల్లి, రెడ్డిఘణాపూర్, ఇస్మాయిల్‌పూర్ గ్రామాల్లో పెసర పంట జోరుగా సాగవుతోంది.