
పాఠశాల స్థలంలో ఇళ్ల నిర్మాణం
చేవెళ్ల: ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చేవెళ్ల తహసీల్దార్ కృష్ణయ్య హెచ్చరించారు. నాంచేరి రెవెన్యూ పరిధిలోని ఇంద్రారెడ్డి నగర్‌లో ప్రభుత్వ పాఠశాలకు కేటాయించిన స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న ఏడు ఇళ్లను శుక్రవారం పోలీసుల సహకారంతో రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఇంద్రారెడ్డి నగర్‌లో ప్రభుత్వ పాఠశాలకు సర్కార్ 2.20 ఎకరాల స్థలం కేటాయించింది. ఇక్కడ ప్రస్తుతం ప్రాథమిక పాఠశాల కొనసాగుతోంది. చుట్టూ ఖాళీ స్థలం ఉండడంతో ఏడుగురు స్థానికులు ఆక్రమించి ఎలాంటి అనుమతులు లేకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ కృష్ణయ్య, ఆర్‌ఐలు చంద్రమోహన్, పవన్, సీఐ భూపాల్ శ్రీధర్, ఎస్‌ఐ సంతోష్‌కుమార్ వెళ్లి నిర్మాణాలను కూల్చివేశారు. ఈ కూల్చివేతల్లో రెవన్యూ సిబ్బంది నర్సింలు, ప్రకాశ్, ఆంజనేయులు, రవీందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ నిర్మాణాల్లో అధికార పార్టీకి చెందిన నాయకుడి కుమారుడి ఇళ్లు ఉండడం విశేషం.
కూల్చివేయించిన రెవెన్యూ అధికారులు