
సత్వరం పూర్తి చేయండి
కలెక్టర్ ప్రతీక్ జైన్
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చేపట్టిన వివిధ మరమ్మతు పనులను సత్వరం పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ వైద్యాధికారులకు సూచించారు. శుక్రవారం ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి అవసరమైన విభాగాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా ఆస్పత్రిని తీర్చిదిద్దుకోవాలన్నారు. మరమ్మతు పనులు ఏ దశలో ఉన్నాయని పంచాయతీ రాజ్ ఈఈ ఉమేష్ కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శివారెడ్డిపేటలోని గోదాంను పరిశీలించారు. మరమ్మతులు చేసి గోదాంను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, డీఆర్‌డీఏ శ్రీనివాస్, డాక్టర్ జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.
స్లాట్ బుక్ చేసుకోండి
అనంతగిరి: పాలిసెట్ – 2025లో ఉత్తీర్ణులైన విద్యార్థులు కళాశాలలో ప్రవేశాల కోసం స్లాట్ బుక్‌చేసుకొని శని, ఆదివారాల్లో జరిగే ధ్రువపత్రాల పరిశీలను హాజరు కావాలని జిల్లా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్ తెలిపారు. 144 మంది విద్యార్థులు స్లాట్ బుక్ చేసుకొని శుక్రవారం ధ్రువపత్రాల పరిశీలనకు 130 మంది హాజరయ్యారని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు
డీఎస్పీ శ్రీనివాస్
పరిగి: చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పరిగి డీఎస్పీ శ్రీనివాస్ హెచ్చరించారు. శుక్రవారం పరిగి పట్టణంలోని పలు వీధుల్లో కేంద్ర సాయుధ బలగాలతో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం నేరమన్నారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తారని అన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా పోలీసుల సాయం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదు
పరిగి: కాంగ్రెస్ మాట ఇస్తే తప్పక నెరవేరుస్తుందని డీసీసీ ప్రధాన కార్యదర్శి హన్మంతు ముదిరాజ్ అన్నారు. శుక్రవారం పరిగి పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేరుస్తోందన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఒక్క డబుల్ బెడ్‌రూం కూడా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వమన్నారు. వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, నాయకులు చిన్న నర్సింలు, శ్రీనివాస్, చంద్రయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
పరిగి పట్టణంలో కవాతు నిర్వహిస్తున్న పోలీసులు