
ఆపరేషన్ ముస్కాన్‌ను విజయవంతం చేద్దాం
అనంతగిరి: ఆపరేషన్ ముస్కాన్–11ను విజయవంతం చేయాలని డీటీసీ అదనపు ఎస్పీ పీవీ మురళీధర్ పిలుపునిచ్చారు. పిల్లలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆపరేషన్ ముస్కాన్‌పై రాష్ట్రస్థాయి ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి కార్మిక, సీ్త్రశిశు సంక్షేమ శాఖ, పోలీస్, బాలల సంక్షేమం, సమితి, రెవెన్యూ, విద్య, పంచాయతీ రాజ్, ఆరోగ్య శాఖల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూలై ఒకటవ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆపరేషన్ ముస్కాన్‌ను విజయవంతం చేయాలన్నారు. తప్పిపోయిన పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చాలని సూచించారు. బాల్యవివాహాలను అరికట్టాలని, పిల్లలతో భిక్షాటన చేయించకుండా చూడాలని ఆదేశించారు. పిల్లలతో పనులు చేయించడం చట్టరీత్యా నేరమన్నారు. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు. బడీడు పిల్లలను చదువుకోనివ్వాలని, వీధి బాలలను రక్షించాలన్నారు. మానవ అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆపరేషన్ ముస్కాన్ –11 కోసం ఏహెచ్‌టీయూ ఇన్‌చార్జ్ ఇన్‌స్పెక్టర్ షేక్ అన్వర్ పాషా ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ఈ బృందాలు జిల్లా అంతటా నిరంతరం తిరుగుతూ బాల కార్మికులను గుర్తిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్మన్ వెంకటేశం, సభ్యులు ప్రకాష్, సంగమేశ్వర్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు జి.కాంతారావు, శ్రీకాంత్, నరేష్ కుమార్, రాజునాయక్, సంతోష్ రెడ్డి, యశోద తదితరులు పాల్గొన్నారు.
పిల్లలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు
డీటీసీ అదనపు ఎస్పీ మురళీధర్

ఆపరేషన్ ముస్కాన్‌ను విజయవంతం చేద్దాం