
డ్రగ్స్‌తో భవిష్యత్ నాశనం
అనంతగిరి: యువత చెడు మార్గాలకు ఆకర్షితులు కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ సూచించారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా యువజన క్రీడలు, శిశు సంక్షేమం, పోలీసు శాఖల ఆధ్వర్యంలో వికారాబాద్ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ఎన్‌టీఆర్ చౌరస్తా నుంచి బీజేఆర్ చౌరస్తా వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. యువత చెడు అలవాట్ల వైపు ఆకర్షితులైతే వచ్చే కష్ట నష్టాలను తల్లిదండ్రులు వివరించాలన్నారు. కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందో తెలియజేయాలని సూచించారు. నేటి యువతే రేపటి భావి భారత పౌరులన్నారు. కొంతమంది డ్రగ్స్‌కు బానిసలై భవిష్యత్‌ను చేజేతులారా నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. యువత డ్రగ్స్, గుట్కా, గంజాయి, సిగరెట్ వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని పేర్కొన్నారు. అనంతరం ఎస్పీ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. భారత దేశానికి యువత పట్టుకొమ్మ లాంటి వారని, వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబం, దేశం బాగుపడుతుందని అన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం, క్రమశిక్షణ చాలా ముఖ్యమన్నారు. మనం చెడు అలవాట్లకు బానిసలైతే తల్లిదండ్రులు పడే క్షోభ వర్ణనాతీతమని, ఇది గుర్తుంచుకొని మెలగాలని యువతకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి మహమ్మద్ సత్తార్, శిశు సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి, జిల్లా అధికారులు, పోలీస్, ఎకై ్సజ్ శాఖ అధికారులు, విద్యార్థినీ, విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
మత్తు పదార్థాలకు దూరంగా ఉందాం
బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం
కలెక్టర్ ప్రతీక్‌జైన్
వికారాబాద్‌లో భారీ ర్యాలీ