
ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచండి
● లబ్ధిదారుల్లో చైతన్యం తేవాలి ● కలెక్టర్ ప్రతీక్ జైన్
అనంతగిరి: పేదల సొంతింటి కలను నెరవేర్చే దిశ గా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై ఎంపీడీఓలు, ఇతర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇప్పటి వరకు ఎన్ని గ్రౌండింగ్ అయ్యాయి, ఎన్నింటికి మార్కింగ్ ఇచ్చారు, ఎప్పటిలోగా పూర్తి చేస్తారు అనే విషయాలపై ఆరా తీశారు. మండలాల వారీగా ఇళ్ల నిర్మాణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండు విడతల్లో మంజురైన ఇళ్ల నిర్మా ణ పనులను జాగ్రత్తగా పరిశీలించాలని ఆదేశించారు.
వైద్యులు అందుబాటులో ఉండాలి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు రోగులకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఎంపీడీఓలు పీహెచ్‌సీలను పరిశీలించి రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీయాలన్నారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేలా చొరవ చూపాలన్నారు. పాఠశాలల్లో మరమ్మతు పనులను పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో వనమహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, లక్ష్యం మేర మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అనంతరం ఉపాధి హామీ పథకం పనులపై ఆరా తీశారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, డీఆర్‌డీఏ శ్రీనివాస్, డీపీఓ జయసుధ, డీఎంహెచ్‌ఓ వెంకటరవణ, అన్ని మండలాల ఎంపీడీఓలు, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.
దరఖాస్తులను పరిశీలించాలి
భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను అన్ని మాడ్యూల్స్‌లో పరిశీలించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ తహసీల్దార్లకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని మండలాల తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిశీలించి డేటా ఎంట్రీ చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి, ఆర్డీఓ వాసుచంద్ర తదితరులు పాల్గొన్నారు.