
తప్పుల తడక
మొయినాబాద్: మున్సిపాలిటీ ఓటరు జాబితా తప్పుల తడకగా మారింది. ఇటీవల విడుదల చేసిన ముసాయిదా జాబితాలో అన్నీ తప్పులే దర్శనమిస్తున్నాయి. ఒకే వ్యక్తి ఓటు రెండు మూడు సార్లు ఉండటంతోపాటు చిన్న పిల్లల ఫొటోలు ఉన్నాయి. మున్సిపల్ పరిధిలో లేనివారి ఓట్లు సైతం జాబితాలో ప్రత్యక్షమయ్యాయి. ఈ నెల 3న మున్సిపల్ అధికారులు వార్డుల విభజన చేపట్టి ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేశారు. ఐదు నెలల క్రితం కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో తొమ్మిది పంచాయతీలు విలీనమయ్యాయి. మొయినాబాద్, సురంగల్, ముర్తూజగూడ, ఎనికేపల్లి, అజీజ్‌నగర్, హిమాయత్‌నగర్, చిలుకూరు, అప్పోజీగూడ, పెద్ద మంగళారం గ్రామ పంచాయతీలు మున్సిపల్‌గా మారాయి. మున్సిపల్ పరిధిలో మొత్తం 32 వేల ఓట్లు ఉండగా 26 వార్డులుగా విభజించారు. ఒక్కో వార్డుకు 1,200 నుంచి 1,300 మంది ఓటర్లు ఉండేలా విభజించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓటరు జాబితా ఆధారంగా వార్డుల విభజన చేపట్టారు.
ప్రతి వార్డులో అదే పరిస్థితి
మున్సిపల్ అధికారులు విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో చాలా వరకు తప్పులే ఉన్నాయి. కొన్ని వార్డుల్లో ఒక్కొక్కరికి రెండు మూడు ఓట్లు ఉన్నాయి. ఒకే జాబితాలో ఒకే రకమైన పేరు, ఫొటోతో రెండు మూడు ఓట్లు కనిపిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. 11వ వార్డుకు సంబంధించిన ఓటరు జాబితాలో 22 ఏళ్ల కుశల అనే ఓటరు స్థానంలో చిన్నపాప ఫొటో ఉంది. 25వ వార్డు ఓటరు జాబితాలో మండల పరిధిలోని కేతిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ దారెడ్డి శోభ పేరు, ఫొటోతో ఉంది. మరణించిన వారి పేర్లు, పెళ్లి చేసుకుని వెళ్లినవారి పేర్లు సైతం ఓటరు జాబితాలో ఉన్నాయి. ఇలా ప్రతి వార్డులో రిపీట్ అయిన ఓట్లు, ఇతర ప్రాంతాలకు చెందినవారి ఓట్లు వందల సంఖ్యలో ఉన్నాయి. మున్సిపల్ అధికారులు విడుదల చేసిన ఓటరు జాబితా తప్పుల తడకగా ఉండటంపై పలు రాజకీయ పార్టీల నాయకులు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు చెందినవారి పేర్లు మున్సిపల్ ఓటరు జాబితాలో ఎలా ఉంటాయని.. అలాంటి వాటిని గుర్తించి అధికారులే తొలగించాలని.. తప్పులను సైతం సరిచేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయిజుద్దీన్‌ను వివరణ కోరగా తమకు పై నుంచి వచ్చిన జాబితా విడుదల చేశామని.. తాము ఎలాంటి సవరణలు చేసే అవకాశం లేదన్నారు. తప్పులేమైనా ఉంటే తహసీల్దార్ వద్దగానీ, ఆన్‌లైన్‌లోగానీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
మున్సిపల్ ఓటరు జాబితాలో అన్నీ పొరపాట్లే..
ఒకే వ్యక్తి ఓటు రెండు మూడుసార్లు
జాబితాలో చిన్నపిల్లల ఫొటోలు
మున్సిపల్ పరిధిలో లేనివారు సైతం ప్రత్యక్షం