గ్రేటర్‌కు గండి
ప్రజా ప్రయోజనాలకు తిలోదకాలు
గ్రేటర్ తిరుపతిలో 63 కాదు..
13 పంచాయతీలే
ఏర్పేడు, చంద్రగిరిలోని కొన్ని గ్రామాలు గ్రేటర్‌లోకి వద్దన్న ఎమ్మెల్యేలు
కౌన్సిల్ తీర్మానానికి విలువ లేదు.. ప్రజా ప్రయోజనాలు అవసరం లేదు.. పచ్చ ఎమ్మెల్యే మాటకే విలువ. వారు చెప్పిందే అమలు.. వెరసి.. గ్రేటర్ తిరుపతి తీర్మానంలో మార్పులు.. కొన్ని గ్రామాలే విలీనం.. మిగిలిన వాటికి చోటు లేదు. ఇదీ కలెక్టరేట్‌లో జరిగిన జిల్లాస్థాయి సమీక్ష తీరు.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ తీర్మానానికి టీడీపీ ఎమ్మెల్యేలు గండికొట్టారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు, చంద్రగిరి పరిధిలోని గ్రామాలను గ్రేటర్ తిరుపతిలో కలిపేందుకు స్థానిక ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్యేల ఆమోదం మేరకే గ్రేటర్ తిరుపతిలో కొన్ని గ్రామాలను మాత్రమే విలీనం చేయనున్నారు. ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలిపిన గ్రామాలను గ్రేటర్ తిరుపతిలో నుంచి తొలగించినట్లు తెలిసింది. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి మహానగరంగా విస్తరించాల్సిన ఆవశ్యకత గురించి నిపుణులు, మేధావులు అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. అందుకు అనుగుణంగా ఇటీవల తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు పట్టుబట్టి గ్రేటర్ తిరుపతికి ఆమోదం లభించేలా కృషి చేశారు. ఆ తీర్మానంలో 10 లక్షల జనాభాతో తిరుపతిని మహానగరంగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే అదే కౌన్సిల్ సమావేశంలో కూటమి సభ్యులు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేసినా.. అవసరమైన సంఖ్యా బలం లేకపోవడంతో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల తీర్మానానికి అంగీకరించక తప్పలేదు. కౌన్సిల్‌లో తమ పంతం నెగ్గించుకోలేకపోయినా.. మంత్రి, ఎమ్మెల్యేలు, అధికారుల ద్వారా సాధించుకున్నారనే ప్రచారం జరుగుతోంది. 63 గ్రామాలతో గ్రేటర్ తిరుపతికి కౌన్సిల్ తీర్మానం చేస్తే.. మంగళవారం కలెక్టరేట్‌లో ఇన్‌చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో కేవలం 13 గ్రామాలకే పరిమితం చేసినట్లు ప్రకటించడంతో కౌన్సిల్ తీర్మానానికి విలువలేకుండా చేసి కార్పొరేటర్ల హక్కులను కాలరాశారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ జిల్లా సమీక్షా సమావేశంలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం అభ్యంతరం తెలిపినా ప్రయోజనం లేకుండా పోయిందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అధికారులు చెబుతున్నట్టు శ్రీకాళహస్తి నియోజక వర్గ పరిధిలోని ఏర్పేడు మండలం, చంద్రగిరి నియోజక వర్గ పరిధిలోని మరి కొన్ని గ్రామాలను గ్రేటర్ తిరుపతిలో కలిపే అవకాశాలు లేవని తేలిపోయింది. ఆయా గ్రామాల పరిధిలోని విలువైన ప్రభుత్వ భూముల కోసమే గ్రేటర్ తిరుపతిలో కలపకుండా అడ్డుకుంటున్నారనే స్థానికులు ఆరోపణలకు బలం చేకూర్చేలా సమీక్షా సమాశంలో నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
సొంత అజెండానే ముఖ్యం
22ఏలోని భూములకు విముక్తి కల్పించండి
జిల్లాలో భూములకు పట్టాలున్నా.. లబ్ధిదారులు అమ్ముకునే వీలు లేకుండా 22ఏలో ఉన్నాయని, అందులో నుంచి తొలగించాలని ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం మంత్రి దృష్టి తీసుకెళ్లారు. భూ యజమానుల పిల్లల పెళ్లిళ్లు, చదువుల కోసం విక్రయించుకోవాలన్నా, బ్యాంకులో తనఖా పెట్టాలన్నా వీలు లేకుండా భూములు 22ఏలో చేర్చారని తెలియజేశారు. తిరుపతి నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని, నగర వాసుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంకా ఈ సమీక్షా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యేలు అధికారులు తమ మాట వినడం లేదని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ దృష్టికి తీసుకుపోవటం గమనార్హం.
గ్రేటర్‌కు గండి


