బకాయలపోరు
జిల్లాలో మామిడి రైతుకు దక్కని ప్రతిఫలం 6 నెలలుగా బకాయిల కోసం ఎదురుచూపులు కేజీకి రూ.3, రూ.4లు ఇస్తున్న ఫ్యాక్టరీలు రోడ్డెక్కుతున్న రైతులు ప్రభుత్వ గిట్టుబాటుపై మండిపాటు పట్టించుకోని పాలకులు
పురుగుమందు డబ్బా తెచ్చివ్వండి. ఇక్కడున్న రైతులంతా తలా కొద్దిగా తాగి చనిపోతాం. ఇంకెందుకు ఈ బతుకులు. కాయలు తోలిన డబ్బులు అడిగితే తప్పా? ఆరునెలలు అవుతోంది. ప్రభుత్వం ఇచ్చిన గిట్టుబాటు ధర ఏదీ? కిలోకు రూ.3 ఇస్తే ఏం చేసుకోవాలి. రైతులంటే అలుసా? ఎందుకు మమల్ని వేధిస్తున్నారు. కిలో రూ.8 ఇవ్వాలంటూ గుడిపాల మండలంలో మంగళవారం ఫ్యాక్టరీలను ముట్టడించి..ఆపై రోడ్డుపై బైఠాయించారు. సమస్యలు పరిష్కరించాలి లేదంటే ఇక్కడి నుంచి కదలమని భీష్మించారు.
గుడిపాల జాతీయ రహదారిపై రోడ్డెక్కిన మామిడి రైతులు
మామిడిసాగు విస్తీర్ణం 50వేల హెక్టార్లు
ఈఏడాది దిగుబడి అంచనా
5 లక్షల మెట్రిక్ టన్నులు
మొత్తం ఫ్యాక్టరీలు 46
కాయలు కొనుగోలు చేసిన ఫ్యాక్టరీలు
31
ఫ్యాక్టరీలకు అమ్ముకున్న కాయలు
2.31లక్షల మెట్రిక్ టన్నులు
ఫ్యాక్టరీలకు విక్రయించిన రైతులు
49,350
ర్యాంపుల సంఖ్య 26
ర్యాంపులకు చేరిన కాయలు
1.44 లక్ష మెట్రిక్ టన్నులు
ర్యాంపులకు తోలిన రైతులు 30,600
ప్రభుత్వం గిట్టుబాటు ధర కిలో రూ.8
ఫ్యాక్టరీలు ఇస్తున్న ధర కిలో
రూ.3 నుంచి 4
ఫ్యాక్టరీలు చెల్లించాల్సిన బకాయిలు
రూ.360 కోట్లు (సుమారు)
జిల్లాలో మామిడి రైతుల కష్టం ఫ్యాక్టరీల పాలవుతోంది. ఇన్నాళ్లు రాజులా బతికిన ఫలరాజుల కడుపు మండిపోతోంది. రైతుల ఫలం ఫ్యాక్టరీల్లో గుజ్జుగా మారి.. ప్రతిఫలం చేతికి చిక్కనంటోంది. నెలల తరబడి రైతాంగం బిల్లుల కోసం ఎదురుచూస్తోంది. తీరా కిలో రూ.3, రూ.4 చెల్లించడంతో బిల్లులపై ఆవేదన చెంది మంగళవారం గుడిపాల మండలంలో రైతులు రోడ్డెక్కి ఆక్రోశం వెళ్లగక్కారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాణిపాకం/గుడిపాల : మామిడిలో తోతాపురి రకం కోతలు జూన్ మాసంలో ప్రారంభమైనప్పటి నుంచి రైతులకు ఒకటే కష్టాలు. దిగుబడి విక్రయించుకునేందుకు నానా అవస్థలు పడ్డారు. టోకెన్ల కోసం తోపులాట, తొక్కిసలాట నడుమ నలిగిపోయారు. ట్రాక్టర్లు దొరక్క తిప్పలు పడ్డారు. తీరా కాయలు ఫ్యాక్టరీలో అన్ లోడింగ్ చేసేందుకు నిద్రలేనిరాత్రుళ్లు గడిపారు. రాత్రుల్లో జాగరణ చేసి..పగలంతా ఫ్యాక్టరీల వద్ద పడిగాపులు పడ్డారు. అయితే ఆ తర్వాత కూడా రైతులను ఫ్యాక్టరీలు వేధిస్తూనే ఉన్నాయి.
గుజ్జు లాగేసుకున్నారు
జిల్లాలో మామిడి 50 వేల హెక్టార్లల్లో విస్తరించింది. ఈ ఏడాది 5 లక్షల మెట్రిక్ టన్నుల కాయలు దిగుబడి అవుతుందని అధికారులు ముందస్తు అంచనా వేశారు. ఆ అంచనా ప్రకారం కాయలు దిగుబడి అయ్యాయి. టేబుల్ రకం మామిడి మాత్రం వివిధ రాష్ట్రాలకు ఎగుమతులు చేశారు. తోతాపురిని కొంత వరకు ఎగుమతి చేయడంతో పాటు 1.44 లక్షల మెట్రిక్ టన్నుల కాయలను ర్యాంపులకు చేరాయి. 2.31 లక్షల మెట్రిక్ టన్నుల కాయలను రైతులు ఫ్యాక్టరీలకు అమ్ముకున్నారు. తీరా వారి కష్టం ఫ్యాక్టరీ పాలవుతోంది.
సిండికేట్‌గా మారిన ఫ్యాక్టరీ నిర్వాహకులు
మామిడి రైతులను దెబ్బతీసేందుకు ఫ్యాక్టరీలు లోలోపల కుట్రలు పన్నుతోంది. సిండికేట్ అయి..మామిడి రైతులను దగా చేస్తున్నారు. కోతల సమయంలో కాయలు వద్దని తిరస్కరించింది. తర్వాత అధికారుల ఒత్తిడితో కొనుగోలు చేస్తున్నట్లు కటింగ్ ఇచ్చారు. చెల్లింపు విషయాన్ని నొక్కి పెట్టారు. కాయలు కొనలేమని బోర్డు పెట్టించి..రైతులకు కన్నీళ్లు తెప్పించారు. తీరా కాయలు కొనుగోలు చేసి..రైతుల కష్టంపై నీళ్లు చల్లింది. కేజీ రూ.3, రూ.4 అంటూ పాట పాడుతోంది.
కనిపించని గిట్టుబాటు ధర
ప్రభుత్వం తోతాపురి రకానికి గిట్టుబాటు ధరను ప్రకటించింది. ప్రభుత్వం కేజీకి రూ. 4 ప్రోత్సాహక నిధి ఇస్తుందని, ఫ్యాక్టరీలు రూ.8 చొప్పున చెల్లిస్తుందని గొప్పలు చెప్పారు. తీరా ఫ్యాక్టరీలు గిట్టుబాటు ధరకు వెనుకాడుతోంది. వారు ఇచ్చే ధర ప్రకారమే డబ్బులు తీసుకోవాలని హుకుం జారీ చేస్తోంది. దీంతో మామిడి రైతులు కన్నెర్ర జేసి ఫ్యాక్టరీలను ముట్టడిస్తున్నారు.
చోద్యం చూస్తున్న పాలకులు
ప్రస్తుత పాలకుల పంచ్‌లు సినిమా డైలాగ్‌లు మించిపోతున్నాయి. మామిడి రైతులను ఉద్దేశించి పాలకులు విసిరిన డైలాగ్‌లు..మాటలకు పరిమితం అయ్యాయి. ప్రభుత్వ గిట్టుబాటు ధర కేజీ రూ.8కి ఇవ్వాలని, లేనిపక్షంలో ఫ్యాక్టరీలు సీజ్ చేస్తామని పంచ్‌లు విసిరారు. ఆ పంచ్‌లు ఆ వేదికకే పరిమితం అయ్యాయని రైతులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పాలకులు చోద్యం చూడడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పాలకులు పట్టించుకోని పక్షంలో మామిడి పోరుకు సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు.
మామిడి వివరాలు..
రోడ్డెక్కిన అన్నదాత
గుడిపాల మండలం కొత్తపల్లి సమీపంలోని ఓ పళ్ల గుజ్జు పరిశ్రమ రూ. 3, రూ.4 చొప్పున రెండు రోజులగా బిల్లులు చెల్లిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న మామిడి రైతులు మంగళవారం ఫ్యాక్టరీ యాజమాన్యంతో వాగ్వివాదానికి దిగారు. కేజీకి రూ.3, రూ.4 ఎలా ఇస్తారని మండిపడ్డారు. రైతులంతా ఏకమై...జాతీయ రహ దారిపై బైఠాయించారు. వర్షాన్ని సైతం లెక్కచేయక తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఫ్యాక్టరీ యాజమాన్యం దిగిరావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో రహదారి పొడవునా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకొని సర్ధుబాటు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో రైతులు, పోలీసుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆపై ఆర్డీఓ శ్రీనివాసులు అక్కడికి చేరుకుని రైతులను సర్ధుబాటు చేశారు. కలెక్టర్ వద్ద చర్చిద్దామని, ఫ్యాక్టరీ వాళ్లను కూడా పిలిపిస్తామని చెప్పడంతో రైతులు ఆందోళనను విరమించారు.
బకాయలపోరు


