ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక నిధులు కేటాయించాలి | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక నిధులు కేటాయించాలి

Dec 3 2025 8:23 AM | Updated on Dec 3 2025 8:23 AM

ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక నిధులు కేటాయించాలి

ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక నిధులు కేటాయించాలి

● పార్లమెంట్‌ సమావేశాల్లో ఎంపీ గురుమూర్తి

తిరుపతి మంగళం : ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ పశు సంపద అభివృద్ధి మిషన్‌ పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని తిరుపతి ఎంపీ డాక్టర్‌ మద్దిల గురుమూర్తి కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ పశు సంపద అభివృద్ధి మిషన్‌ అమలు స్థితిగతులు, తిరుపతి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అందుతున్న ప్రయోజనాలపై మంగళవారం పార్లమెంట్‌లో ఎంపీ ప్రశ్నించారు. ఇప్పటివరకు ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం రూ.113.06 కోట్ల నిధులు కేటాయించగా, అందులో రూ.53.53 కోట్ల నిధులు రాష్ట్రానికి విడుదలైనట్లు కేంద్ర మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ తెలిపారు. తిరుపతి జిల్లాకు ప్రత్యేకంగా రూ.5.27 కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పారు. తిరుపతి జిల్లాలో పథకం అమలు వివరాలను వెల్లడిస్తూ జిల్లాలో 15,553 పశువుల బీమా కోసం రూ.2.89 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అలాగే రైతులకు 1,463 పశుగ్రాసం మిని కిట్లు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. పశుసంవర్థక రంగంలో స్థానిక యువతకు నైపుణ్యాభివృద్ధి అందించే కార్యక్రమంలో భాగంగా 62 మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. మొత్తంగా తిరుపతి జిల్లాలో రూ.5.89 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయని మంత్రి పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రయోజనాల విషయానికొస్తే, తిరుపతి జిల్లాలో జాతీయ పశు సంపద అభివృద్ధి మిషన్‌ కింద 36 మంది ఎస్సీలు, 29 మంది ఎస్టీలు నేరుగా లబ్ధి పొందినట్లు మంత్రి తెలిపారు. అదనంగా 1,094 మంది ఎస్సీ రైతులు, 118 మంది ఎస్టీ రైతులు పరోక్షంగా ఈ పథకం కింద ప్రయోజనం పొందినట్లు తెలిపారు. ఈ పథకంలో ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ కోటా లేకపోయినా, రాష్ట్రాలు తమ షెడ్యూల్డ్‌ కుల, గిరిజన సబ్‌ ప్లాన్‌ నిధులను వినియోగించి ఈ వర్గాలకు మరిన్ని ప్రయోజనాలు అందించవచ్చని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఈ పథకాన్ని మళ్లీ పునరుద్ధరిస్తూ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి సబ్‌ ప్లాన్‌ నిధుల నుంచి కాకుండా ఈ పథకంలోనే ప్రత్యేకంగా నిర్దిష్ట నిధులు కేటాయించే విధానాన్ని ప్రవేశపెడితే అనేక మంది పాడి రైతులకు ప్రత్యక్ష లాభం చేకూరుతుందని ఎంపీ గురుమూర్తి కోరారు. ఎస్సీ, ఎస్టీ రైతులు పశు సంపద రంగంలో ఎదుర్కొంటున్న కష్టాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ప్రత్యేక జోక్యం చేసుకోవాలని కోరారు. పథకం అమలు నిలిచిపోవడంతో పశు పోషణపై ఆధారపడిన ఎస్సీ, ఎస్టీ, సన్నకారు రైతులు, మహిళలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకం నిలిచిపోవడంతో రైతులు తమ పశువులకు బీమా చేసుకోలేకున్నారని, దీంతో ప్రకృతి వైపరీత్యాలు, వ్యాధులతో చనిపోయిన పశువుల స్థానంలో, కొత్తవి కొనుగోలు చేయలేక రైతులు నష్టపోతున్నారని ఎంపీ పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో పథకం అమలును వేగవంతం చేసి, రైతులకు సత్వర ప్రయోజనాలు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement