కనిపిస్తే కబ్జా..అడగరనే దర్జా..!
రూ.కోట్ల విలువైన కాలువ పోరంబోకు కబ్జా జాతీయ రహదారి సమీపంలో దురాక్రమణ యథేచ్ఛగా జేసీబీలతో చదును పట్టించుకోని అధికారులు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వే నంబర్ 11లో 3.22ఎకరాల కాలువ పోరంబోకు భూమిని తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు కబ్జాదారులు చేస్తున్నారు. గతంలో ఆ భూమిని కాజేయాలని చేసిన ప్రయత్నాలను అప్పటి రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. దాంతో ఆక్రమణదారులు ఆ భూమిని అలాగే వదిలేసినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వంలో స్థానిక ముఖ్యప్రజాప్రతినిధి అండదండలతో యథేచ్ఛగా చదును పనులు చేపట్టినట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నా రు. రూ.కోట్ల విలువైన కాలువ పోరంబోకు భూమిని కబ్జాదారులు కాజేస్తుంటే అడ్డుకోకపోవడంపై మండి పడుతున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న రెవెన్యూ అధికారులు ఆ కాలువ భూమిని కంటికిరెప్పలా కాపాడితే ఇప్పటి అధికారులు దగ్గరుండి చదును చేయిస్తున్నా రని ఆరోపిస్తున్నారు. కాలువ భూమిని చదును చేయ డానికి మూడు రోజులుగా రెండు జేసీబీలు పనిచేస్తుంటే అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి అటు వెళుతున్నా ఆగని ఆక్రమణ
తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం వచ్చిన రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ మంగళవారం ఉదయం తిరుపతి నుంచి ఉప్పరపల్లి మీదుగా వకు ళామాత ఆలయానికి వెళుతున్న క్రమంలో జాతీయ రహదారికి సమీపంలో ఉన్న కాలువ పోరంబోకు భూముల్లో కబ్జాదారులు చదును చేసే పనులు చేస్తున్నారు. అదే సమయంలో మంత్రి వెంట వెళుతున్న రెవెన్యూ అధికారులు సైతం ఆ దురాక్రమణను కళ్లా రా చూస్తూ వెళ్లారే తప్ప ఏ ఒక్కరు అడ్డుకున్న దాఖ లాలు లేవని ఉప్పరపల్లి వాసులు చెబుతున్నారు. గ్రామ అవసరాలకు పెట్టుకున్న ఆ భూమిని కాజేస్తుంటే ఆపేవారు లేరా? అని ప్రశ్నిస్తున్నారు. ఆక్రమిత భూమిలో చదును పనులు ఆపకుంటే జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.
‘అధికార పార్టీలో ఉన్నాం.. అనుకున్నదంతా అక్రమిస్తాం.. మమ్మల్ని ఆపేదెవరు.. అడిగేదెవరు.. అంతా మా ఇష్టం.. అది ప్రభుత్వ భూమి అయినా.. చెరువులైనా.. మఠం భూములైనా.. కాలువ భూములైనా సరే కబ్జాకు కాదేదీ అనర్హం అన్న రీతిలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. కోట్లు విలువైన భూములను కళ్లముందే కాజేస్తున్నా అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు నోరుమెదపడం లేకున్నారు.. సాక్షాత్తు రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్య ప్రసాద్ ఆ మార్గంలో వెళుతున్నా సరే కబ్జా దారులు దర్జాగా చదును పనులు చేస్తున్నా సంబంధిత అధికారులు చూస్తూ వెళ్లడం విమర్శలకు తావిస్తోంది.’
రెవెన్యూ రికార్డుల్లో కాలువ పోరంబోకు
ఆక్రమిత భూమికి సంబంధించి రెవెన్యూ రికార్డులు అన్నీ కాలువ పోరంబోకుగా చెబుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై కలెక్టర్‌కు ఫి ర్యాదు చేస్తామని, ఆపై న్యాయ పోరాటం చేస్తా మని ఉప్పరపల్లి వాసులు చెబుతున్నారు. రూ.కోట్ల విలువ చేసే కాలువ పోరంబోకు భూ మిని కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయంపై తహసీల్దార్ రామాంజులునాయక్‌ను వివ రణ కోరగా కాలువ భూములను కాపాడుతామని, చదును చేసే పనులను వెంటనే నిలుపుదల చేయిస్తామన్నారు.


