
వివాహిత అనుమానాస్పద మృతి
– భర్త, కుటుంబ సభ్యులే చంపారంటూ ఆందోళన
తడ : మండలంలోని అక్కంపేటలో గురువారం చిత్తూరు జిల్లా కుప్పానికి చెందిన వివాహిత శిల్ప(26) అనుమానాస్పదంగా ఉరివేసుకున్న స్థితిలో చనిపోయింది. తమ బిడ్డ మృతికి భర్త, అతని కుటుంబ సభ్యులే చంపి ఉరి వేసినట్టు చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. తొలుత అక్కంపేట గ్రామం వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చెయ్యడంతో గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం తడ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని శిల్ప ఫొటోలతో ఆందోళన చేశారు. ఎస్‌ఐ కొండపనాయుడు ఆందోళన చేస్తున్న వారిని సర్దుబాటు చేసి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి రెండేళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు.
కాలం చెల్లిన ఔషధాల
పంపిణీపై ఫిర్యాదు
సత్యవేడు : సత్యవేడుకు చెందిన శోభారాణి బుధవారం రాత్రి ఓ క్లినిక్‌కు వెళ్లగా కాలం చెల్లిన మాత్రలు అంటగట్టారని డ్రగ్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపారు. సత్యవేడులోని ఓ క్లినిక్‌కు వెళ్లి మెడికల్ షాపులో ఐదు రకాల మాత్రలు ఇచ్చారని, అందులో రెండు మాత్రలు కాలం చెల్లినవి ఉన్నాయన్నారు. దీనిపై శ్రీకాళహస్తి డ్రగ్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.