
వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత
తిరుపతి సిటీ : వ్యవసాయరంగంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా పరిశోధనలు జరగాలని ఆచార్య ఎన్జీరంగా వర్సిటీ వీసీ డాక్టర్ శారద జయలక్ష్మి పిలుపునిచ్చారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు శ్రీవ్యవసాయంలో సవాళ్లు, వాతావరణ అనుకూలత, నూతన ఆవిష్కరణలుశ్రీ అనే అంశాలపై రెండు రోజులపాటు జరగనున్న జాతీయ సదస్సును ఆమె వెటర్నరీ కళాశాల ఆడిటోరియంలో శుక్రవారం అతిథులతో కలసి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగంపై శాస్త్రవేత్తలు దృష్టి సారించాలన్నారు. వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సమస్యలను కనుగొని రైతుల ఆదాయాన్ని పెంచడానికి దోహదపడతాయన్నారు. అనంతరం బెంగళూరుకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ పూర్వ పరిశోధనా సంచాలకులు డాక్టర్ ఎంఏ శంకర్ మాట్లాడుతూ.. నూతన వంగడాల దిగుబడి సామర్థ్యం పెంపొందించడానికి పంట యాజమాన్య పద్ధతులు కీలకమన్నారు. రాష్ట్ర రైతు సాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ద్వారా గణనీయమైన పురోగతి సాధించవచ్చని సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యాన వర్సిటీ వీసీ డాక్టర్ రాజిరెడ్డి, డైరెక్టరేట్ ఆఫ్ వీడ్ రీసెర్చ్ జబల్పూర్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రాజు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ విద్యాసాగర్, ఎన్జీరంగా వర్సిటీ పరిశోధనా సంచాలకులు డాక్టర్ సత్యనారాయణ, ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ డాక్టర్ సుమతి, ఇండియన్ సొసైటీ ఆఫ్ ఆగ్రానమీ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ వైస్ చైర్మన్ డాక్టర్ భరతలక్ష్మి, ఎస్వీ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ ఎంవీ రమణ, వ్యవసాయ శాస్త్రవేత్తలు, రీసెర్చ్ స్కాలర్స్ పాల్గొన్నారు.