టీ20 టికెట్ల దందా: హెచ్‌సీఏ సభ్యుడు, కుమారుడు అరెస్ట్ | T20 ticket scam HCA member son arrested | Sakshi
Sakshi News home page

టీ20 టికెట్ల దందా: హెచ్‌సీఏ సభ్యుడు, కుమారుడు అరెస్ట్

Oct 14 2026 8:55 AM | Updated on Oct 14 2026 8:59 AM

T20 ticket scam HCA member son arrested

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న భారత్-వెస్టిండీస్ టీ20 మ్యాచ్‌కు చెందిన కాంప్లిమెంటరీ టికెట్లను బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్న నలుగురిని గోషామహల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచసీఏ) సభ్యుడు సతీష్ చంద్ర శ్రీవాస్తవ, ఆయన కుమారుడు ఆకర్షిత్ శ్రీవాస్తవతో పాటు వారి సహచరులు అవినాష్ దారక్, మోహిత్ సోమాని ఉన్నారు.

అక్టోబర్ 12 రాత్రి బేగంబజార్‌లోని ఎస్‌డీ మాల్ సమీపంలో అక్రమ విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు దాడి చేసి దారక్, సోమానిలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ‘నాట్ ఫర్ సేల్’ అని ఉన్న 11 కాంప్లిమెంటరీ మ్యాచ్ టికెట్లతో పాటు 8 దాండియా పాస్‌లు, ఒక ద్విచక్ర వాహనం, 3 మొబైల్ ఫోన్లు మరియు రూ. 5,000 నగదును సీజ్ చేశారు.

హెచ్‌సీఏ సభ్యుడైన తన తండ్రి ద్వారా వచ్చిన టికెట్లను ఆకర్షిత్ తన సహచరులకు ఇవ్వగా, వారు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ప్రచారం చేస్తూ ఒక్కో టికెట్‌ను రూ.3,500 నుండి రూ. 6,000 వరకు విక్రయించినట్లు విచారణలో తేలింది. అరెస్టుకు ముందే సుమారు 9 టికెట్లు అమ్మినట్లు పోలీసులు గుర్తించి, నిందితులపై బీఎన్ఎస్, సిటీ పోలీస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. అలాగే శ్రీవాస్తవకు మొత్తం ఎన్ని కాంప్లిమెంటరీ టికెట్లు ఇచ్చారో తెలపాలని హెచ్‌సీఏకు లేఖ రాయనున్నట్లు వెల్లడించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement