
ఇంకా ఖరారు కాని విధివిధానాలు
2024 వానాకాలం నుంచే ఇస్తామన్న సీఎం
ఇప్పటికే రెండు పంటలకు మొండిచెయ్యి
గత ఏప్రిల్‌లో మంత్రి తుమ్మల సమావేశం
నెలలు గడుస్తున్నా అతీగతీ లేని విధివిధానాలు
క్రాప్ బుకింగ్ తరువాతే నిర్ణయిస్తామంటున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా... పంటల బీమా పథకం అమలుపై ఇప్పటివరకు మార్గదర్శకాలు రూపొందించలేదు. బీఆర్‌ఎస్ హయాంలో రద్దయిన పంటల బీమా పథకాన్ని 2024 వానకాలం సీజన్‌లోనే పునః ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించినా.. గత రెండు సీజన్లలో పంటల బీమాపై అడుగు ముందుకు పడలేదు.
రాష్ట్రంలో వానకాలం సీజన్ ప్రారంభమై ఇప్పటికే 60 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు వేశారు. ఈసారైనా పంటల బీమా పథకాన్ని అమలు చేస్తారా లేదా? అని రైతులు ఎదురు చూస్తున్నారు. పంటల బీమాకు సంబంధించి ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకంలో చేరాలా లేక సొంతంగా రాష్ట్రంలో బీమా పథకాన్ని రూపొందించాలా? అనేది ప్రభుత్వం తేల్చుకోలేకపోతోంది.
మూడు నెలలైనా ముందుకు పడని అడుగు
పంటల బీమా పథకానికి విధి విధానాలు రూపొందించాలని ఏప్రిల్ 23వ తేదీన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కానీ, ఇప్పటివరకు వ్యవసాయ శాఖ దానిని పట్టించుకోనే లేదు. గతంలో వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్లతో మంత్రి సమావేశమైనప్పటికీ బ్యాంకర్లు పంటల బీమాపై ఆసక్తి చూపలేదు. దీంతో ప్రధాని ఫసల్ బీమా పథకంలోనే చేరాలని సూత్రప్రాయంగా నిర్ణయించినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని గతంలో అమలు చేశారు. 2018–19 సీజన్ తరువాత ఈ పథకాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిలిపివేసింది.
11 క్లస్టర్లుగా రాష్ట్రం
రాష్ట్రంలో పంటల బీమాను పునరుద్ధరించాలంటే ఫసల్ బీమా ఒక్కటే సరైనదిగా రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనాకు వచి్చంది. రాష్ట్రాన్ని 11 క్లస్టర్లుగా విభజించి బీమా అమలు చేయాలని నిర్ణయించారు. వానకాలం సీజన్‌లో సుమారు 132 లక్షల ఎకరాల్లో పంటలు, యాసంగిలో 78 లక్షల ఎకరాల్లో వేస్తారని లెక్క కట్టారు. ఈ నేపథ్యంలో ఫసల్ బీమా పథకం మార్గదర్శకాల ప్రకారంగా వానకాలానికి మొత్తం ప్రీమియంలో రైతు వాటా కింద 2 శాతం, యాసంగిలో 1.5 శాతం.. వాణిజ్య, ఉద్యాన పంటలకు 5 శాతం ప్రీమియం రైతు వాటాగా తీసుకోవాలని నిర్ణయించారు.
మిగిలిన ప్రీమియంలో రాష్ట్రం, కేంద్రం 50:50 చొప్పన భరిస్తాయి. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో ఈసారి వరి సాగు మందగించింది. కాగా, పంటలు వేసిన తరువాత క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణాధికారులు క్రాప్ బుకింగ్ ప్రక్రియ చేపడతారు. అంటే ఏ పంటను ఏ రైతు ఎంత విస్తీర్ణంలో సాగు చేశారనే లెక్కలను రూపొందిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాతే పంటల బీమా పథకం అమలు ప్రక్రియ ప్రారంభమవుతుందని వ్యవసాయశాఖలోని ఒక కీలక అధికారి తెలిపారు.