
నామినేషన్లకు సిద్ధమవుతున్న ట్రిపుల్ ఆర్, ఫార్మాసిటీ, లగచర్ల బాధితులు, గ్రూప్–1 అభ్యర్థులు, నిరుద్యోగులు, మాలలు
ఇప్పటికే 30 మంది నామినేషన్లు..120కి పైగా నామినేషన్ ఫారాల సేకరణ
ఈవీఎంలను అనుసంధానించే సదుపాయం ఉన్నా ఎక్కువ మందితో తప్పని ఇబ్బందులు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక..!
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే పలు రకాలుగా ప్రాధాన్యతను సంతరించుకుంది. అన్ని రాజకీయ పార్టీలకు ఈ ఎన్నిక ఫలితం భవిష్యత్ సూచిక అనే అభిప్రాయాలున్నాయి. అందుకే వేటికవిగా అన్నివిధాలుగా శక్తియుక్తులు ఒడ్డుతున్నాయి. అధికార యంత్రాంగానికి సైతం ఈ ఉపఎన్నిక పెనుసవాల్‌గా మారింది. సాధారణంగా ఏ ఎన్నికలో అయినా పది మందో, ఇరవై మందో పోటీలో ఉంటారు. కానీ.. ప్రభుత్వంపై వ్యతిరేకతతో వివిధ వర్గాల వారు, అసంతుషు్టలు ఈ ఉపఎన్నికతో తమ సత్తా చాటాలని భావిస్తున్నారు. భారీ సంఖ్యలో నామినేషన్లు వేసి ఇండిపెండెంట్లుగా పోటీ చేయడం ద్వారా ప్రజలకు తమ వేదన వెల్లడించడంతో పాటు ప్రభుత్వానికి సెగ తగిలేలా చేయాలనుకుంటున్నారు.
ట్రిపుల్‌ఆర్, ఫార్మాసిటీ, లగచర్ల ప్రాజెక్టుల భూసేకరణ బాధితులు, గ్రూప్–1 అభ్యర్థులు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు, ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి మాలలు, తదితర వర్గాలు, గ్రూపులకు చెందిన వారు భారీ సంఖ్యలో ఇండింపెండెంట్లుగా నామినేషన్లు వేసేందుకు ‘జూబ్లీహిల్స్’ను వేదిక చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికే బుధవారం వరకు 30 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు వేసేందుకు మరో 120 మందికి పైగా నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు సమయముంది. ఆలోగా ఇంకెంతమంది నామినేషన్లు వేయనున్నారో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకొంది.
అధికారులకు ఇరకాటం
బ్యాలెట్ పేపర్ల కాలం ముగిశాక ఈవీఎంల ద్వారా పోలింగ్ జరుగుతుండటం తెలిసిందే. ఒక ఈవీఎంలో గరిష్టంగా 16 మంది అభ్యర్థులు, గుర్తులకు అవకాశం ఉంది. వీటిల్లో ఒకటి నోటాకు పోను 15 మంది అభ్యర్థులుంటారు. ఎక్కువమంది అభ్యర్థులు బరిలో ఉంటే గతంలో ఒక కంట్రోల్ యూనిట్‌కు నాలుగు బ్యాలెట్ యూనిట్లు జత చేసేవారు. తద్వారా నోటా పోను 63 మంది అభ్యర్థులకు అవకాశం ఉండేది. 2013 తర్వాత నుంచి ఎం3 ఈవీఎంలను వినియోగిస్తున్నారు. వీటిని ఒక కంట్రోల్ యూనిట్‌కు గరిష్టంగా 24 బ్యాలెట్ యూనిట్లను కనెక్ట్ చేయవచ్చు. నోటా పోను 383 మంది అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. అంతకుమించి అభ్యర్థులు బరిలో మిగిలితే సంప్రదాయ పద్ధతిలో బ్యాలెట్ విధానానికి వెళ్లాల్సి వస్తుంది.
గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్‌లు సిద్ధం చేసుకున్నారు. రెండు బ్యాలెట్ యూనిట్లు మించి అవసరం రాకపోవచ్చునని అంచనా వేశారు. కానీ నామినేషన్లు పెరిగితే అదనపు యూనిట్లు సమకూర్చుకోవడం, ర్యాండమైజేషన్ వంటివి చేయాల్సి వస్తుంది. ఓటరు తాను వేసిన ఓటు సరిగ్గా పడిందో లేదో తెలుసుకునే వీవీప్యాట్‌లను కూడా అదనంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. గతంలో 1996లో నల్లగొండ పార్లమెంట్‌కు 470 మందికి పైగా ఇండిపెండెంట్లు, ఈవీఎంలు వచ్చాక గత పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి దాదాపు 185 మంది పోటీలో ఉండటం తెలిసిందే.