
నిర్వాహకుల్ని తొలగించే అధికారం నాదే..!
సాక్షి, చైన్నె: పీఎంకేలో నిర్వాహకులను తొలగించడం, కొత్త వారికి పదవులు అప్పగించడం వంటి అధికారం తనకు మాత్రమే ఉందని పీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు రాందాసు స్పష్టం చేశారు. గురువారం తైలాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమిళనాడులో క్షీణించిన శాంతి భద్రతల గురించి ప్రస్తావించారు. బాణసంచాల ప్రమాదాలు రోజురోజుకూ పెరుగుతున్నా, కార్మికుల భద్రత విషయంలో పాలకులు నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తున్నారని మండి పడ్డారు. చైన్నెలో రోడ్లు మరీ అద్వన్నంగా మారి ఉన్నాయని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలలో అన్నాడీఎంకే లేదా డీఎంకే కూటమిలో పీఎంకే అంటూ వస్తున్న వార్తలన్నీ పుకార్లు మాత్రమేనని స్పష్టం చేశారు. ఎవరితో కూటమి అన్నది పార్టీ నిర్వాహక కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. పార్టీ నుంచి ఎవ్వర్నీ తొలగించే అధికారం అన్బుమణికి లేదని స్పష్టం చేశారు. ఎవరినైనా తొలగించాలన్నా, మరెవరికై నా పదవి అప్పగించాలన్నా.. అధికారం తనకు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. పీఎంకే ఎమ్మెల్యే అరుల్ పార్టీ శాసన సభా విప్ కూడా అని గుర్తు చేస్తూ, ఆయన్ను తొలగించాలనుకుంటే తొలుత పార్టీ శాసన సభా పక్షనేత జీకేమణి ద్వారా స్పీకర్‌కు లేఖ ఇవ్వాల్సి ఉంటుందని, ఆ తర్వాత తొలగింపు నిర్ణయం అన్నది ఉంటుందన్నారు. అయితే, అవన్నీ చేయకుండా అరుల్‌ను తొలగించినట్టు అన్బుమణి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని, వాస్తవానికి పార్టీలో సర్వాధికారం తనకు మాత్రమే అన్నది అందరూ గుర్తుంచుకోవాలని సూచించారు. అన్బుమణికి సంబంధించిన ప్రశ్నలను ఇక తన వద్ద సందించ వద్దు అని మీడియాకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.