
దర్శకుడు సెల్వరాఘవన్ హీరోగా నూతన చిత్రం
తమిళసినిమా: విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు సెల్వరాఘవన్. ఈయన తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. నటి ఖుషీ రవి నాయకిగా నటిస్తున్న ఇందులో సీనియర్ నటుడు వైజీ.మహేంద్రన్, మైమ్‌గోపి, కౌశల్య, సతీష్, దీపక్, హేమ, లిత్రిక, ఎన్.జ్యోతికన్నన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఇంతకు ముందు ట్రిప్, తూక్కుదురై వంటి చిత్రాలను తెరకెక్కించిన డెన్నీస్ మంజునాథ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ఇది. దీన్ని విజయ సతీష్ సమర్పణలో వ్యోమ్ ఎంటర్‌టెయిన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోంది. దీనికి రవివర్మ.కే ఛాయాగ్రహణంను, ఏకే.ప్రియన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర షూటింగ్‌ను సేలంలో ప్రారంభించి దాని పరిసర ప్రాంతాల్లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు యూనిట్ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. చక్కని ప్రకృతి కలిగిన సేలంలో తమ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని , ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల వంటి మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు వారు తెలిపారు.