
డిసెంబర్ నాటికి కుత్తంబాక్కం బస్టాండ్
తిరువళ్లూరు: చైన్నెలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి సుమారు రూ.414 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కుత్తంబాక్కం బస్టాండ్‌ను డిసెంబర్ నాటికి అందుబాటులోకి తెస్తామని మంత్రి శేఖర్‌బాబు స్పష్టం చేశారు. తిరువళ్లూరు జిల్లా కుత్తంబాక్కంలో సుమారు రూ.414 కోట్ల వ్యయంతో నూతన బస్టాండ్ పనులు చేపట్టారు. తిరుపతి, శ్రీకాళహస్తి, కడప, తిరుత్తణి, తిరుపత్తూరు, వేలూరు, బెంగళూరు, తిరువణ్ణామలై, హోసూరుతోపాటు సుమారు 20 ప్రాంతాలకు చెందిన బస్సులను ఇక్కడి నుంచే కొనసాగించనున్నారు. ఆ బస్టాండ్ పనులను మంత్రి శేఖర్‌బాబు పరిశీలించారు. పనుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బెంగళూరు, తిరుపతి, హోసూరు, తిరుపత్తూరు తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచే రాకపోకలు సాగించడం ద్వారా చైన్నెకు ట్రాపిక్ ముప్పు తప్పుతుందన్నారు. ఇప్పటికే కిలాంబాక్కం నుంచి బస్సులు నడపడంతో సమస్యలు తగ్గుముఖం పట్టాయన్నారు. కిళాంబాక్కం నుంచి రైల్వే పనులు దాదాపు పూర్తయిన క్రమంలో మరో రెండు మూడు నెలల్లో రైల్వే సదుపాయం కిళాంబాక్కం నుంచి అందుబాటులోకి వస్తుందన్నారు. దీంతోపాటు మాధవరం బస్‌స్టాండు పనులు ఇంకా పూర్తి కాలేదన్న ఆయన, త్వరలోనే పూర్తి చేస్తామని, మెట్రో సదుపాయం కూడా వస్తుందన్నారు. కిళాంబాక్కం, మాధవరం, కుత్తంబాక్కం, చెంగల్‌పట్టు, మహాబలిపురం తదితర ప్రాంతాల్లోని బస్టాండ్ పూర్తిగా అందుబాటులోకి వస్తే ట్రాపిక్ సమస్యలు పూర్తిగా తగ్గుముఖం పడతాయన్నారు. కిళాంబాక్కం బస్టాండు నుంచి రాత్రి 11–12 గంటల మధ్యలో రవాణా సదుపాయం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్న మంత్రి, తక్కువ మంది ప్రయాణికులున్నా కిళాంబాక్కం నుంచి వేర్వేరు ప్రాంతాలకు రవాణా సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ తనిఖీల్లో రాష్ట్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి కాకర్ల ఉష, కలెక్టర్ ప్రతాప్, ఎమ్మెల్యే కృష్ణస్వామి పాల్గొన్నారు.