
అవినీతి కేసులో ముగ్గురి అరెస్టు
తిరువళ్లూరు: రోడ్డు విస్తరణ కోసం ప్రభుత్వానికి భూములు ఇచ్చిన రైతులకు పరిహారం చెల్లించడానికి రూ.75 వేలు లంచం తీసుకున్న స్పెషల్ తహసీల్దార్‌తో సహా ముగ్గురిని విజిలెన్స్ అధికారులు అరెస్టు చేసి, విచారణ చేపట్టారు. ఎన్నూరు నుంచి మహాబలిపురం వరకు రోడ్డు విస్తరణ, అవుటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం కోసం తిరువళ్లూరు జిల్లా పోలీవాక్కం ప్రాంతానికి చెందిన వెల్‌వ్యూస్సేష్ సంస్థకు చెందిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇందుకోసం ప్రభుత్వం సుమారు రూ.45 లక్షలు పరిహారంగా ఇవ్వాల్సి ఉంది. పరిహారం మొత్తాన్ని విడుదల చేయాలని పలుసార్లు ఆ సంస్థ మేనేజర్ అగస్టీన్ జోసెఫ్ కోరినా ఫలితం లేకుండా పోయింది. అయితే పరిహారం మంజూరు చేయడానికి రూ.లక్ష లంచం ఇవ్వాలని స్పెషల్ తహసీల్దార్ డిమాండ్ చేశారు. ఇందుకు సమ్మతించిన అగస్టీన్ జోసెఫ్ మొదట విడతగా రూ.75 వేలు ఇవ్వడానికి అంగీకరించి, విజిలెన్స్ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు లంచం మొత్తాన్ని ఎడ్వర్ట్ విల్సన్‌కు చెందిన బ్రోకర్‌లు కోమధినాయగం, వెల్లదురైకు ఇస్తుండగా విజిలెన్స్ డీఎస్పీ గణేషన్, ఇన్‌స్పెక్టర్ మాల నేతృత్వంలోని విజిలెన్స్ అధికారులు వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం వ్యవహరంలో స్పెషల్ తహసీల్దార్‌కు ప్రత్యక్ష ప్రమేయం ఉండడంతో ముగ్గురిని అరెస్టు చేసి, విచారణ జరుపుతున్నారు.