సాక్షి, చైన్నె: పళణి దండాయుధ పాణి ఆలయాన్ని ఇతర మతస్తులు దర్శించుకునే విషయంలో కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మదురై ధర్మాసనం స్పష్టం చేసింది. దేవుడి మీద నమ్మకంతో తాను దర్శనానికి వస్తున్నట్లు తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాలని న్యాయమూర్తి శ్రీమది మంగళవారం తీర్పు వెలువరించారు. వివరాలు.. రాష్ట్రంలో సుబ్రమణ్య స్వామికి ఉన్న ఆరుపడై వీడులలో మూడవదిగా దిండుగల్ జిల్లాలోని పళని ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఇక్కడి కొండపై దండాయుధ పాణిగా స్వామివారు కొలువై ఉన్నారు. ఇక్కడకు వెళ్లేందుకు మెట్లమార్గం, రోప్‌కారుతో పాటు వించ్ ట్రైన్ సౌకర్యం ఉంది. నిత్యం ఇక్కడకు భక్తులు, పర్యాటకులు తరలి వస్తుంటారు. ఇతర మతస్తులు సైతం పెద్దఎత్తున రావడం జరుగుతోంది. అయితే ఇతర మతస్తులకు ఆలయంలోకి ప్రవేశం లేదని గతంలో ఇక్కడ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వివాదానికి దారితీయడంతో తర్వాత తొలగించారు. ఈ బోర్డును మళ్లీ ఏర్పాటు చేసేలా దేవదాయ శాఖ, పళణి ఆలయ పాలక మండలిని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కొంత కాలంగా మదురై ధర్మాసనంలో విచారణ సాగింది. వాదనలు ముగియడంతో మంగళవారం న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఇందులో ఇతర మతస్తులు ఆలయ ప్రవేశంపై ఆంక్షలు విధించారు. హిందూ దేవుళ్లపై నమ్మకం లేని వారికి అనుమతి లేదని స్పష్టం చేశారు. పళణి దండాయుధ పాణిని దర్శించుకోదలిచిన ఇతర మతస్తుల కోసం ప్రత్యేక రిజిస్టర్‌ను ఆలయ ఆవరణలో ఏర్పాటు చేయాలని వివరించారు. ఇందులో వారు తొలుత డిక్లరేషన్ ఇచ్చి తర్వాతే ఆలయంలోకి వెళ్లాలని ఆదేశించారు. దేవుడి మీద నమ్మకంతోనే తాను దర్శనానికి వచ్చినట్లుగా ఇతర మతస్తులు ఆ పుస్తకంలో తప్పనిసరిగా నమోదు చేయాలని తీర్పులో స్పష్టం చేశారు.
అన్యమతస్తులైన భక్తులకు
మదురై ధర్మాసనం ఆదేశాలు