
నకిలీ విత్తనాలు అంటగట్టారని రైతుల ఆందోళన
సూర్యాపేట : తనకు నకిలీ విత్తనాలు అంటగట్టారని ఆరోపిస్తూ ఓ రైతు మరి కొందరు కర్షకులతో కలిసి విత్తన దుకాణం ఎదుట ఆందోళన నిర్వహించాడు. ఈ సంఘటన మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మోతె మండలం కూడలి గ్రామానికి చెందిన భూక్య మహేందర్ మే 31వ తేదీన మూడు బస్తాల సాంబ మసూరి విత్తనాలను కొనుగోలు చేశాడు. ఈ విత్తనాలను గత నెల 23వ తేదీన నానబెట్టి మండె కట్టి అదే నెల 26న నారు చల్లాడు. మూడు రోజులపాటు చూసినా నారులో ఎదుగుదల లేకపోవడంతో మొలకశాతం తక్కువగా వచ్చిందని భావించాడు. వెంటనే వరి విత్తనాలు కొనుగోలు చేసిన సూర్య ఆగ్రో ట్రేడర్స్ ముందు కొందరు రైతులతో కలిసి ఆందోళనకు దిగాడు. దీనిపై సూర్యాపేట మండల వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేయగా స్పందించి విత్తన కంపెనీ ప్రతినిధి, సూర్య ఆగ్రో ట్రేడర్స్ యజమానితో మాట్లాడి మొలకశాతం తక్కువగా వచ్చినందున మూడు బస్తాలకు బదులుగా మరో మూడు బస్తాల కొత్త విత్తనాలను రైతుకు ఇచ్చే విధంగా ఒప్పించారు. ఈ విత్తనాలను వెంటనే మండల వ్యవసాయ అధికారి సమక్షంలోనే అందించారు. ఈ విషయమై రైతు భూక్య మహేందర్ మాట్లాడుతూ మండె కట్టిన సమయంలో వాతావరణ మార్పుల కారణంగా వరినారు సరిగా పెరగలేదన్నారు. నారు చల్లిన సమయంలో అధిక ఉష్ణోగ్రత కారణంగా ఈ విధంగా జరిగిందని వ్యవసాయ అధికారులు చెప్పినట్లు తెలిపారు. సానుకూలంగా స్పందించి తాను కొలుగోలు చేసిన మూడు బస్తాల సాంబ మసూరి వరి విత్తనాల స్థానంలో తిరిగి మరోమూడు బస్తాలు ఇప్పించిన మండల వ్యవసాయ అధికారి, ఇచ్చిన సూర్య ఆగ్రో ట్రేడర్స్ కు ఆరైతు కృతజ్ఞతలు తెలిపారు.