
దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి
మునగాల : జూలై 9న చేపట్టబోయే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.రాంబాబు కోరారు. బుధవారం మునగాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రామకృష్ణారెడ్డికి సీఐటీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో సమ్మె నోటీస్ అందజేసి మాట్లాడారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకువచ్చి వాటి అమలుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. నాలుగు లేబర్ కోడ్‌లు అమలైతే కార్మిక సంఘాల ఏర్పాటు కష్టతరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో కార్మికుల సమ్మె హక్కుకు సైతం పరిమితులు ఏర్పడతాయని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగ భద్రత లేకుండా పోతుందని, ఉపాధి అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని, కార్మికశాఖ నిర్వీర్యం అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్‌కోడ్‌లను రద్దు చేసి కార్మికచట్టాలను అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూరి రాంబాబు, హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు అనంతు మైసయ్య గౌడ్, మండల నాయకులు బి.వీరబాబు, నరేష్, బి.సైదులు తదితరులు పాల్గొన్నారు.
ఫ సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాంబాబు