
సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ బదిలీ
సూర్యాపేట అర్బన్: సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ బి.శ్రీనివాస్ బదిలీ అయ్యారు. ఈమేరకు మంగళవారం సీడీఎంఏ నుంచి ఉత్వర్వులు వెలువడ్డాయి. శ్రీనివాస్ హైదరాబాద్‌లోని కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో రిపోర్ట్ చేశారు. సూర్యాపేట కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. కాగా సెక్రటేరియట్‌లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న హనుమంత రెడ్డి పదోన్నతిపై సూర్యాపేట గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్‌గా రానున్నారు. ఆయన 26న బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
పశువైద్యాధికారులు అందుబాటులో ఉండాలి
తుంగతుర్తి : వర్షాకాలంలో పశువైద్యాధికారులు.. రైతులకు అందుబాటులో ఉండాలని జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాసరావు సూచించారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని పశు వైద్య శాలను తనిఖీ చేసి మాట్లాడారు. పశువులకు సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు అందుబాటులో ఉంచి రైతులకు తగిన సలహాలు సూచనలు అందించాలన్నారు. అనంతరం పశు వైద్యశాలలోని రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట సహాయ సంచాలకుడు డాక్టర్ రవి ప్రసాద్, సిబ్బంది బుచ్చిబాబు తదితరులు ఉన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు టీజేఎస్ కసరత్తు
సూర్యాపేట : రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ జన సమితి(టీజేఎస్) కసరత్తు చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల సబ్ కమిటీ సభ్యుడు కుంట్ల ధర్మార్జున్, నాయకులు గోపగాని శంకర్, రమేష్ తెలిపారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలో టీజేఎస్ నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కమిటీల అధ్యక్ష, కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. సమావేశంలో రమాశంకర్, బొడ్డు శంకర్, సర్దార్ హుస్సేన్, రవి, దేవదానం, కరుణాకర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, నాగేశ్వరరావు, గిరిబాబు, సందీప్, పాపయ్య, వినయ్ గౌడ్, కృష్ణారెడ్డి, సుమాన్‌నాయక్, సైదానాయక్ పాల్గొన్నారు.
హౌస్ వైరింగ్‌లో ఉచిత శిక్షణ
నల్లగొండ : ఎస్‌బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ నిరుద్యోగులకు హౌజ్ వైరింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నల్లగొండలోని ఎస్‌బీఐ ఆర్‌సెటీ డైరెక్టర్ ఇ.రఘుపతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాకు చెందిన నిరుద్యోగులు ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. 31 రోజుల ఉండే శిక్షణకు ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు ఉంటాయని తెలిపారు. 19 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు కలిగి 10వ తరగతి ఉత్తీర్ణులైన నిరుద్యోగ గ్రామీణ యువకులు అర్హులని తెలిపారు.

సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ బదిలీ