
మార్పు కోసమే జరిమానాలు
ఫ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని జాగ్రత్తగా ఉండాలి
ఫ ఆటో డ్రైవర్ల అవగాహన సదస్సులో ఎస్పీ నరసింహ
సూర్యాపేటటౌన్ : వాహనాలకు జరిమానాలు విధించడం అనేది మార్పుకోసమేనని, తప్పుల నుంచి మంచి పాఠాలు నేర్చుకొని జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ, డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించారు. డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లమని ఆటోడ్రైవర్లతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఆటో డ్రైవర్లు వాహనాలు కండిషన్లో ఉంచుకోవాలని, వాహనాలు నడిపేటప్పుడు సౌండ్ బాక్స్‌లు వినియోగించొద్దన్నారు. ప్రతి ఒక్కరూ లైసెన్సు, వాహన రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని, ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని, నిబంధనల ప్రకారం డ్రైవర్ దుస్తులు ధరించి వాహనాలు నడపాలన్నారు. వ్యక్తిగత క్రమశిక్షణ, వ్యక్తిగత ఆత్మాభిమానం ఉన్నప్పుడే ఇతరుల పట్ల మర్యాదగా ఉండగలమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర పోలీస్ యాంటి నార్కోటిక్ బ్యూరో ఆదేశాల మేరకు జిల్లాలో డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాల నివారణకు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం యాంటీ డ్రగ్స్ సోల్జర్ ఫ్లెక్సీ తో ఆటో డ్రైవర్లతో కలిసి ఎస్పీ, ఆర్టీఓ సెల్ఫీ ఫొటోలు దిగి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి సురేష్‌రెడ్డి, ట్రాఫిక్ ఎస్‌ఐ సాయిరాం, సిబ్బంది, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.
సదస్సుకు హాజరైన ఆటో డ్రైవర్లు

మార్పు కోసమే జరిమానాలు