
సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యం ఇవ్వాలి
సూర్యాపేట : ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు చేసేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ వైద్యులను ఆదేశించారు. సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఆస్పత్రికి వచ్చే వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అత్యవసర వార్డు, టీబీ యూనిట్ వార్డు, జెరియాట్రిక్ కేర్ వార్డు, డే కేర్ కిమోథెరపీ వార్డు, జ్వరం, కోవిడ్ ఐసోలేషన్ వార్డులను కలెక్టర్ పరిశీలించారు. వైద్యసేవలు, మందులు ఇస్తున్నారా లేదా అని పేషంట్లను అడిగి తెలుసు కోన్నారు. రోజూ బ్లడ్ టెస్టుల వివరాలు, రిజిస్టర్లలో నమోదు పరిశీలించారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్ లో మందుల లభ్యత గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదరం క్యాంపు నిర్వహించేటప్పుడు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మెరుగైన వసతులు కల్పించి సక్రమంగా నిర్వహించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే నిర్మాణంలో ఉన్న ఎంసీహెచ్ సెంటర్ భవనాన్ని సందర్శించి పనులను వేగవంతం చేయాలన్నారు. డి అడిక్షన్ సెంటర్ ఏర్పాటుకు స్థలం సేకరించాలని, అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని పేర్కొన్నారు. ఆయన వెంట సూపరింటెండెంట్ సత్యనారాయణ, ఆర్‌ఎం డాక్టర్ వినయ్ ఆనంద్, డాక్టర్ లక్ష్మణ్, వైద్య సిబ్బంది ఉన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్