
ఆయిల్‌పామ్ సాగుతో అధిక ఆదాయం
తాళ్లగడ్డ (సూర్యాపేట) : ఆయిల్ పామ్ సాగుతో అధిక ఆదాయం పొందవచ్చని జిల్లా ఉద్యాన శాఖ అధికారి తీగల నాగయ్య సూచించారు. గురువారం సూర్యాపేట మండలం పిన్నాయిపాలెంలో మాదగోని రమేష్ వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ పామ్ మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న ఆయిల్ పామ్ సాగు చేసినట్లయితే రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చన్నారు. ఆయిల్ పామ్ తోటనాటిన నాలుగవ సంవత్సరం నుంచి దిగుబడి ప్రారంభమవుతుందన్నారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం బిందు సేద్యం, ఎరువులు, అంతర పంటలకు రాయితీలు ఇస్తుందన్నారు. ఎరువులు, అంతర పంటల యాజమాన్యానికి ఎకరానికి రూ. 4,200 చొప్పున మొదటి నాలుగు సంవత్సరాలు ప్రోత్సాహకంగా ఇస్తుందని తెలిపారు. ఆసక్తి గల రైతులు ఉద్యాన శాఖ అధికారులకు దరఖాస్తు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పతంజలి ఆయిల్ పామ్ కంపెనీ తెలంగాణ డివిజనల్ మేనేజర్ బి. యాదగిరి, మేనేజర్ జె. హరీష్, జూనియర్ మేనేజర్ శశి కుమార్, ఫీల్డ్ ఆఫీసర్ వెంకట్, క్షేత్ర సహాయకులు యానాల సుధాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కాషయ్య, సుధాకర్, డ్రిప్ ప్రతినిధి మోహన్ పాల్గొన్నారు.
ఫ జిల్లా ఉద్యాన శాఖ అధికారి నాగయ్య