
లోక్‌అదాలత్‌లో 3013 కేసులు పరిష్కారం
చివ్వెంల(సూర్యాపేట) : పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికే జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద అన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన మెగాలోక్ అదాలత్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నాలుగు బెంచీల ద్వారా క్రిమినల్, సివిల్, మోటార్ వెహికల్, విద్యుత్, బ్యాంకు, గృహహింసకు సంబంధించి 3013 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ పరిష్కారం కాని కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. చిన్నచిన్న ఘర్షణలకు కోర్టు మెట్లు ఎక్కకుండా, పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవాలన్నారు. దీని వల్ల సమయం, ధనం వృథా కాకుండా ఉంటుందన్నారు. కోర్టు సీనియర్ న్యాయవాది గోండ్రాల అశోక్ ఆధ్వర్యంలో కక్షిదారులకు పులిహోర ప్యాకెట్లు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వరవళి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి పుంకరబోయిన రాజు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద