
నకిలీ మద్యం తయారీ వెనుక అధికార పార్టీ అండదండలు
కందుకూరు నియోజకవర్గంలో బెల్టు షాపులకు సరఫరా
● ఇందులో ఇద్దరు వ్యక్తుల పాత్ర
● గోదావరి, నెల్లూరు జిల్లాల్లో
ఇటీవల ఎకై ్సజ్ దాడులు
● ఈ దాడుల్లో పట్టుబడిన వారి
సమాచారంతో సోదాలు
● అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నట్లు సమాచారం
కందుకూరు: గుడ్లూరుకు చెందిన ఓ టీడీపీ నేత తన ఇంట్లోనే నకిలీ మద్యం తయారు చేస్తున్న గుట్టు శనివారం ఎస్సైజ్ అధికారులు దాడుల్లో రట్టయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బరితెగించిన టీడీపీ నేత ఉప్పలపాటి వీరాంజనేయరాజు తన ఇంట్లోనే నకిలీ మద్యం తయారు చేసి బెల్టుషాపుల ద్వారా విక్రయాలు సాగించినట్లు తెలుస్తోంది. శనివారం ఎకై ్సజ్ అధికారులు చేసిన దాడుల్లోనే మద్యం తయారీకి ఉపయోగించే సుమారు 400 లీటర్ల రెక్టిఫైడ్ స్పిరిట్, మద్యం సీసాలు, తయారీకి ఉపయోగించే మెషిన్లతోపాటు రూ.లక్షలు విలువ చేసే మందు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఇద్దరి పాత్ర ఉన్నట్లు ఎకై ్సజ్ అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల గోదావరి, నెల్లూరు జిల్లాలో నకిలీ మద్యం తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించిన ఎకై ్సజ్ అధికారులు తయారీ దారులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. వారి ఇచ్చిన సమాచారంతో గుడ్లూరులో సోదాలు నిర్వహించినట్లు సమాచారం.
మద్యం షాపులతోపాటు
బెల్టు దుకాణాలకు సరఫరా
తయారు చేసిన నకిలీ మద్యాన్ని పలు మద్యం షాపులతోపాటు బెల్టు షాపులకు సరఫరా చేస్తున్నారు. ఎక్కడా ఎవరికి అనుమానం రాకుండా మద్యం సీసాలు, వాటిపై లేబుల్స్ పక్కాగా ఏర్పాటు చేసుకున్నారు. లేబుల్‌పై ఒరిజినల్‌ను తలపించే రీతిలో మద్యం బాటిళ్లపై ఉండే లేబుల్, బ్యాచ్ నంబర్లు, ఎమ్మార్పీ ధరలు కూడా తయారు చేసి వేస్తున్నారు. అంతా పక్కాగా వేసి గుట్టు చప్పుడు కాకుండా నకిలీ మద్యాన్ని తయారు చేసి విక్రయిస్తూ రూ.లక్షలు సంపాదిస్తున్నారు.
పేదల ఆరోగ్యంతో చెలగాటం
ఎక్కువగా ఈ మద్యం తక్కువ ధరకు లభించి ఛీప్ లిక్కర్‌ను పోలిన బాటిళ్లు, పలు రకాల బ్రాండ్ల పేర్లతో నకిలీవి తయారు చేస్తున్నట్లు సమాచారం. ఈ మద్యం ధర తక్కువగా ఉండడంతో ఎక్కువగా పేదలు మాత్రమే వీటిని తాగుతుంటారు. ఈ నకిలీ మద్యాన్ని కందుకూరు, లింగసముద్రం, వలేటివారిపాళెం, గుడ్లూరు మండలాలతోపాటు పక్క జిల్లాలకు కూడా సరఫరా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా తీర ప్రాంతాల్లోని గ్రామాల్లో విక్రయిస్తున్నారు. ఇలాంటి నకిలీ మద్యం తయారు చేసి పేద ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు.
విచారణ పేరులో కాలయాపన
ఎకై ్సజ్ అధికారులు నకిలీ మద్యం తయారీ దారులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఉంది. అయితే మీడియాకు వివరాలు వెల్లడించేందుకు వెనుకంజ వేస్తున్నారు. విచారణ చేస్తున్నామని పూర్తి విచారణ తర్వాతే సమాచారం ఇస్తామంటూ కాలయాపన చేస్తున్నారు. నకిలీ మద్యం తయారీ నిర్వాహకులను తప్పించేందుకు అధికార పార్టీ పెద్దల నుంచి అధికారులకు ఒత్తిడి వస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. చాలా కాలం నుంచి నియోజకవర్గంలో ఇలాంటి దందాలు నడుస్తున్న అధికారులు స్పందించింది లేదు. బెల్టు షాపుల నిర్వాహణలోనే అధికారులు కనసన్నలోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది.
మద్యం, బెల్టు షాపుల్లో తనిఖీ చేస్తే..
టీడీపీ నేత ఉప్పలపాటి వీరాంజనేయరాజు తయారు చేసిన నకిలీ మద్యాన్ని ఇప్పటికే మద్యం, బెల్టు షాపులకు అధిక మొత్తంలో సరఫరా చేసినట్లు తెలుస్తోంది. దుకాణాలపాటు బెల్టు షాపుల్లో ఎకై ్సజ్ అధికారులు తనిఖీలు చేస్తే భారీ స్థాయిలో నకిలీ మద్యం పట్టుబడుతుందని తెలుస్తోంది. ఏ దుకాణానికి ఎంత సరుకు సరఫరా చేశారో ఎకై ్సజ్ అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. నకిలీ మద్యం తాగి అనారోగ్యపాలైన వారిని ఆరోగ్య సిబ్బందితో గుర్తించి అనుమానం వచ్చిన వారికి మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం కూడా ఉందని పలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
కూటమి పాలనలో కందుకూరు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు చేయని అక్రమ వ్యాపారాల్లేవు. ఇప్పటికే ఇసుక, గ్రావెల్, రేషన్ బియ్యం, పేకాట, కోడి పందేలు, అసాంఘిక కార్యకలాపాల్లో ఆరితేరారు. తాజాగా ఓ టీడీపీ నేత ఏకంగా తన ఇంట్లోనే నకిలీ మద్యం తయారు చేస్తూ బెల్టు షాపులకు సరఫరా చేస్తూ మందుబాబుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న గుట్టును ఎకై ్సజ్ అధికారులు రట్టు చేశారు. సదరు నేత అధికార పార్టీ నేతల అండదండలతో కొంత కాలంగా ఈ అక్రమ వ్యాపారానికి తెర తీసినట్లు తెలుస్తోంది. ఇటీవల గోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఎకై ్సజ్ అధికారులు చేసిన దాడుల్లో నకిలీ మద్యం తయారీ చేస్తూ పట్టుబడిన అధికార పార్టీ నేతలు ఇచ్చిన సమాచారం మేరకు తనిఖీలు చేయడంతో తెలుగు తమ్ముడి బాగోతం బయట పడినట్లు తెలుస్తోంది.
ఈ నకిలీ మద్యం తయారీ వెనుక మద్యం షాపుల నిర్వాహకులు, అధికార పార్టీ నాయకులు అండదండలు ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. నకిలీ మద్యం తయారు చేస్తూ పట్టుబడిన వీరాంజనేయులు మండలంలోని అధికార పార్టీకి చెందిన ప్రధాన నేతల అనుచరుడు. అసాంఘిక కార్యకలాపాల్లో ఆరితేరినట్లు తెలుస్తోంది. సదరు నాయకుడు మండలంలో పేకాట శిబిరాలు నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తుంటారు.

నకిలీ మద్యం తయారీ వెనుక అధికార పార్టీ అండదండలు

నకిలీ మద్యం తయారీ వెనుక అధికార పార్టీ అండదండలు

నకిలీ మద్యం తయారీ వెనుక అధికార పార్టీ అండదండలు