
ఇష్టారాజ్యంగా బదిలీలు
మనోవేదనకు..
సాంఘిక సంక్షేమ
శాఖలో ఇదీ పరిస్థితి
● కౌన్సెలింగ్ లేదు
● అయోమయంలో
సంక్షేమ విద్యా సహాయకులు
● వివరాలు తెలుసుకోవడానికి
కార్యాలయానికి రాక
● పట్టించుకోని ఉన్నతాధికారులు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): సంక్షేమ విద్యా సహాయకుల బదిలీల ప్రక్రియ గందరగోళంగా మారింది. ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లాలో 500 మందికి పైగా ఉన్న సహాయకుల్లో ఎవరిని ఎక్కడికి మార్చారో తెలియడం లేదు. బదిలీల ప్రక్రియ గత నెల 30వ తేదీకి పూర్తి కావాల్సి ఉంది. అయితే ఆ శాఖలోని అధికారులు, సిబ్బంది ఆఫీస్‌లో లేకపోవడంతో వివరాలు తెలియక ఉద్యోగులు దూర ప్రాంతాల నుంచి నెల్లూరుకు వచ్చి కార్యాలయంలో వేచి చూడటం పరిపాటిగా మారింది. నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి ఉంది.
సిఫార్సు లేఖల వల్లే..
సాంఘిక సంక్షేమ శాఖ డీడీ, సీనియర్ అసిస్టెంట్లు కార్యాలయంలో లేకపోవడంతో ఏం జరుగుతుందో ఉద్యోగులకు తెలియడం లేదు. గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఇప్పటికే వివిధ శాఖలకు అందించిన సీనియారిటీ జాబితా ప్రకారం బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ జరగాల్సి ఉంది. ఏఎస్‌డబ్ల్యూ పరిధిలో అందరి ఉద్యోగుల దగ్గర ఆప్షన్ ఫారం ఇచ్చి మూడు సచివాలయాలు ఎంపిక చేసుకోవాలని, దాని సీనియారిటీ ప్రకారం బదిలీ చేస్తామని చెప్పారని ఉద్యోగులు అంటున్నారు. అయితే కూటమికి ప్రజాప్రతినిధులు ఇచ్చిన సిఫార్సు లేఖలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిసింది. లెటర్లు లేకపోతే ఎక్కడికై నా బదిలీలు చేస్తామని అధికారులు ఫోన్ చేసి తెలుపుతున్నారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వేరే చోటుకు వెళ్లండి
బదిలీకి దరఖాస్తు చేసుకున్న కొంతమంది ఉద్యోగులకు ఆ శాఖ సిబ్బంది ఫోన్‌లు చేసి మీరు పెట్టుకున్న ప్లేస్ ఖాళీగా లేదు. వేరే చోటుకు బదిలీ చేస్తామని చెబుతున్నారని ఆరోపణలున్నాయి. అసలు బదిలీల ప్రక్రియలో ఉద్యోగులను ఏమీ అడగకుండా సంబంధిత శాఖాధికారులు కార్యాలయంలో అందుబాటులో ఉండటం లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. మొత్తం బదిలీల ప్రక్రియ వ్యవహారాన్ని గోప్యంగా ఉంచడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది గత నెల 30వ తేదీ నుంచి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయితే వారికి ఎవరూ వివరాలు అందించడం లేదు. అధికారులకు ఫోన్ చేస్తే సరైన సమాధానం ఉండటం లేదు.
బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాల్సి ఉంది. అయితే ఆ శాఖలోని కొందరు అధికారుల చేష్టల వల్ల సంక్షేమ విద్యా సహాయకులు తీవ్ర మనోవేదనకు గురువుతన్నారు. ఎవరికి ఏ ప్రాంతానికి బదిలీ జరుగుతుందోనని తెలియని పరిస్థితి ఉంది. ముఖ్యంగా దివ్యాంగులు, అనారోగ్య కారణాలున్నవారు, ఒంటరి మహిళలు, స్పౌజ్ కేటగిరీ విషయంలో నిబంధనలను పాటించడం లేదని విమర్శలున్నాయి. ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి నిబంధనల ప్రకారం బదిలీలు నిర్వహించడం లేదని చెబుతున్నారు. ఇప్పటికే సొంత మండలాల్లో స్థానం కోల్పోయామని తెలిసిన వారు ఏ ప్రభుత్వ ఉద్యోగులకై నా ఇలా చేస్తారా? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనల ప్రకారమే నిర్వహించాం
ప్రభుత్వ నిబంధనల ప్రకారమే బదిలీలు నిర్వహించాం. బదిలీలు అయిపోయినట్టే. ఆ జాబితాను కలెక్టర్‌కు అందజేశాం. ఆఫీసులో కరెంట్ లేకపోవడం వల్ల కొండాయపాళెం గేటు వద్ద అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ కార్యాలయంలో జాబితాను రూపొందించాం. మేము ఎవరికీ ఫోన్ చేయలేదు.
– శోభారాణి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ