
వెయ్యి మొబైల్ ఫోన్ల రికవరీ
నెల్లూరు(క్రైమ్): వివిధ కారణాలతో ప్రజలు పోగొట్టుకున్న సుమారు రూ.2 కోట్ల విలువైన 1,000 మొబైల్ ఫోన్లను పోలీస్ అధికారులు రికవరీ చేశారు. శుక్రవారం నెల్లూరులోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ కృష్ణకాంత్ చేతుల మీదుగా ఫోన్లను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మొబైల్ హంట్ ద్వారా ఎనిమిది విడతల్లో రూ.4 కోట్ల విలువైన 3,900 ఫోన్లు, సీఈఐఆర్ ద్వారా రూ.6 లక్షల విలువైన 60 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించా మన్నారు. మొబైల్ హంట్ (91543 05600)తోపాటు సీఈఐఆర్ సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని ఎవరైనా తప్పుడు పద్ధతిలో వినియోగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫోన్లను గుర్తించి అప్పగించిన ఎస్పీ, సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నెల్లూరు నగర డీఎస్పీ పి.సింధుప్రియ, సైబర్ క్రైమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎనిమిది విడతల్లో బాధితులకు
3,900 ఫోన్ల అందజేత
ఎస్పీ కృష్ణకాంత్