
స్థల వివాదంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దాడి
ఆత్మకూరు: చేజర్ల మండలం తూర్పుకంభంపాడు గ్రామంలో స్థల వివాదంలో వైఎస్సార్‌సీపీ మహిళా కార్యకర్త కృష్ణవేణిపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. బాధితుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన పంచేటి కృష్ణవేణికి ఆమె బంధువువైన టీడీపీ కార్యకర్త కృష్ణయ్యకు మధ్య స్థల వివాదం ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం తహసీల్దార్ బి.మురళి గ్రామానికి వెళ్లాడు. కృష్ణవేణి పొజిషన్ సర్టిఫికెట్ రద్దు చేస్తున్నామని, కృష్ణయ్యకు దారికి స్థలం ఇవ్వాలని చెప్పాడు. దీనిపై కృష్ణవేణి అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టులో ఈ అంశం ఉందన్నారు. రెండు నెలల క్రితం కోర్టు కమిషనర్ వచ్చి స్థలం పరిశీలించారని, ఇంకా తీర్పు వెలువడలేదన్నారు. ఈ సమయంలో దారి ఎలా ఇవ్వమంటారంటూ తహసీల్దార్‌ను ప్రశ్నించారు. అయితే తహసీల్దార్ ఆదేశాలతో సర్వేయర్, వీఆర్వోలు స్థలం కొలతలు వేసి కర్రలు నాటాలని ప్రయత్నించగా కృష్ణవేణి, ఆమె బంధువులు ప్రశ్నించారు. కృష్ణయ్య, అతని బంధువులు కృష్ణవేణిపై దాడికి పాల్పడ్డారు. దీంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాధితురాలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా సిబ్బంది లేరని తొలుత ఫిర్యాదు తీసుకోలేదు. ఫోన్‌లో ఎస్సై తిరుమలేశ్వరరావును సంప్రదించిన అనంతరం ఫిర్యాదు అందజేసి బాధితురాలిని ఆత్మకూరులోని ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స కోసం బంధువులు తరలించారు. ఈ విషయమై తహసీల్దార్ స్పందిస్తూ అప్పట్లో ఇచ్చిన పొజిషన్ సర్టిఫికెట్ సర్వే నంబర్ తప్పు అని, అందుకే దానిని రద్దు చేస్తానన్నారు. కాగా కృష్ణయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణవేణిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు పరిగణలోకి తీసుకోలేదన్నారు.
అప్పుల బాధ తాళలేక..
● పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
నెల్లూరు సిటీ: అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. రూరల్ పరిధిలోని కలివెలపాళెంలో నివాసముంటున్న చాంద్‌బాషా (43) బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఇటీవల అప్పులు చేశాడు. ఆర్థిక సమస్యలతో వాటిని తీర్చలేకపోయాడు. గురువారం రాత్రి మామిడితోటలో చాంద్‌బాషా పురుగు మందు తాగి ఇంటికెళ్లాడు. కుటుంబ సభ్యులు గుర్తించి అతడిని హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.