KL Rahul: టీమిండియా అభిమానులకు శుభవార్త! కోలుకుంటున్న కేఎల్‌ రాహుల్‌!

KL Rahul Tweets Road To Recovery After Undergoing Surgery - Sakshi

KL Rahul: టీమిండియా వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ అభిమానులకు శుభవార్త! గాయంతో ఇన్నాళ్లు ఆటకు దూరమైన అతడు త్వరలోనే మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఇందుకు సంబంధించిన సన్నాహకాలు మొదలుపెట్టినట్లు కేఎల్‌ రాహుల్‌ స్వయంగా వెల్లడించాడు.

కాగా ఐపీఎల్‌-2022లో కొత్త ఫ్రాంఛైజీ లక్నో సూపర్‌ జెయింట్స్‌కు సారథ్యం వహించిన రాహుల్‌.. తొలి సీజన్‌లోనే జట్టును ప్లే ఆఫ్స్‌నకు చేర్చాడు. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. 15 ఇన్నింగ్స్‌లో 616 పరుగులు చేసి తాజా సీజన్‌లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.

ఈ క్రమంలో రోహిత్‌ శర్మ గైర్హాజరీ నేపథ్యంలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు రాహుల్‌. అయితే, ఆఖరి నిమిషంలో గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. దీంతో రిషభ్‌ పంత్‌ భారత జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టి ముందుకు నడిపించాడు.

ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్‌ టెస్టు నాటికైనా రాహుల్‌ కోలుకుంటాడనుకుంటే అలా జరుగలేదు. గతేడాది జరిగిన సిరీస్‌లో రెండో టాప్‌ స్కోరర్‌గా ఉన్న అతడు ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో అభిమానులు ఆందోళనలో మునిగిపోయారు. కనీసం వన్డే, టీ20 సిరీస్‌కైనా అందుబాటులో ఉంటాడా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.

ఈ నేపథ్యంలో కేఎల్‌ రాహుల్‌ ట్విటర్‌ వేదికగా తన ఆరోగ్యానికి సంబంధించిన అప్‌డేట్‌ అందించాడు. ‘‘అందరికీ హలో..‍ గత రెండు వారాలుగా కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నాను. అయితే, సర్జరీ విజయవంతంగా పూర్తైంది. ఇప్పుడు బాగున్నాను. కోలుకుంటున్నాను. నా ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను’’ అని రాహుల్‌ పేర్కొన్నాడు.

కాగా రాహుల్‌కు జర్మనీలో స్పోర్ట్స్‌ హెర్నియా సర్జరీ జరిగినట్లు సమాచారం. త్వరలోనే అతడు బెంగళూరులోని జాతీయ క్రికెట​ అకాడమీకి చేరుకుని అక్కడే ఆరు నుంచి 12 వారాల పాటు శిక్షణ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక పొట్ట దిగువ భాగంలో(మృదువైన కణజాలం) తీవ్రమైన నొప్పి రావడాన్ని సాధారణంగా స్పోర్ట్స్‌ హెర్నియాగా వ్యవహరిస్తారు. 

చదవండి: ENG Vs IND 5th Test: "అతడు అద్భుతమైన ఆటగాడు.. అటువంటి వ్యక్తిని ఇంతవరకూ చూడలేదు"

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top