IPL 2022: ఒక్క మ్యాచ్‌ అయినా గెలవండిరా బాబూ! సిగ్గుతో చచ్చిపోతున్నాం!

IPL 2022 Fans Troll MI CSK Both Lose First 4 Games Oye Ek Match Tho Jeet Ke Jao - Sakshi

IPL 2022 MI CSK Both Lost First 4 Games So Far: ఐదుసార్లు ఐపీఎల్‌ టైటిల్‌ సాధించిన రికార్డు ఓ జట్టుది.. నాలుగుసార్లు విజేత.. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ‘ఘనత’ మరొక జట్టుది.. కానీ ఐపీఎల్‌-2022లో మాత్రం ఈ రెండు జట్లు దారుణ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటున్నాయి.. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ ఓటమి పాలై పాయింట్ల పట్టికలో వరుసగా తొమ్మిది, పది స్థానాల్లో నిలిచాయి. 

అవును.. ఈ ప్రస్తావన ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్ల గురించే! 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లకు గానూ ముంబై విన్నర్‌గా నిలిస్తే.. చెన్నై 2010, 2011, 2018, 2021 ఐపీఎల్‌ ట్రోఫీని గెలుచుకుంది.- సాక్షి, వెబ్‌డెస్క్‌

రోహిత్‌ ‘వైఫ్యలం’ !
ఐపీఎల్‌లో విజయవంతమైన కెప్టెన్‌గా పేరొందిన ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ సీజన్‌లో ఇంతవరకు ఒక్క గెలుపును కూడా నమోదు చేయలేకపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌(4 వికెట్ల తేడాతో), రాజస్తాన్‌ రాయల్స్‌(23 పరుగుల తేడాతో), కోల్‌కతా నైట్‌రైడర్స్‌(5 వికెట్ల తేడాతో), రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(7 వికెట్ల తేడాతో) ఓటమి పాలై పరాజయాల పరంపర కొనసాగిస్తున్నాడు.

భారీగా డబ్బు చెల్లించి రిటైన్‌ చేసుకున్న కీరన్‌ పొలార్డ్‌ విఫలం కావడం.. బౌలింగ్‌ భారం మొత్తం జస్‌ప్రీత్‌ బుమ్రాపైనే పడటం ప్రభావం చూపుతోంది. రోహిత్‌ సైతం బ్యాటర్‌(నాలుగు మ్యాచ్‌లలో వరుసగా 41, 10, 3, 26)గా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఢిల్లీతో మినహా మిగతా మ్యాచ్‌లలో ఆశించిన రీతిలో అతడు రాణించలేకపోయాడు.  

జడేజా అనుభవలేమి!
ఇక చెన్నై సూపర్‌కింగ్స్‌ విషయానికొస్తే... అంతా తానై జట్టును ముందుండి నడిపించే సారథి, మిస్టర్‌ కూల్‌ ఎంఎస్‌ ధోని ఈ సీజన్‌తో కెప్టెన్సీకి ముగింపు పలికాడు. అతడి వారసుడిగా టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు మేనేజ్‌మెంట్‌ పగ్గాలు అప్పగించింది. అయితే, బ్యాటర్‌గా, బౌలర్‌గా, ఫీల్డర్‌గా ఆకట్టుకునే జడేజా కెప్టెన్‌గా మాత్రం రాణించలేకపోతున్నాడు.

పరోక్షంగా.. ఒక్కోసారి ప్రత్యక్ష్యంగానే ధోని రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోతోంది. సీఎస్‌కేకు వరుస పరాభవాలు తప్పడం లేదు. ధోని వెనుకుండి నడిపించినా.. కెప్టెన్‌గా జడేజా అనుభవలేమి కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. 

వరుస పరాజయాలు
డిపెంఢింగ్‌ చాంపియన్‌గా.. రన్నరప్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో జడ్డూ సారథ్యంలోని సీఎస్‌కే ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఆ తర్వాత కొత్త జట్టు లక్నో సూపర్‌జెయింట్స్‌(6 వికెట్ల తేడాతో), పంజాబ్‌ కింగ్స్‌(54 పరుగుల తేడాతో), సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(8 వికెట్ల తేడాతో) ఘోర పరాజయాలను మూటగట్టుకుంది.

దారుణమైన రన్‌రేటు(-1.211)తో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. గత సీజన్‌లో ఆరెంజ్‌ క్యాప్‌ గెలుచుకున్న చెన్నై ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ వరుసగా విఫలం కావడం, మరో విధ్వంసకర ఓపెనర్‌ ఫాఫ్‌ డు ప్లెసిస్‌(ప్రస్తుతం ఆర్సీబీ కెప్టెన్‌) లేకపోవడం తీవ్ర ప్రభావం చూపుతోంది. 

లక్నో, గుజరాత్‌ హిట్టూ!
అన్ని విభాగాల్లోనూ సీఎస్‌కే ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. ఫలితంగా డిఫెండింగ్‌ చాంపియన్‌ ఈసారి కనీసం ప్లే ఆఫ్స్‌కైనా చేరుకుంటుందో లేదో అని అభిమానులు ఉసూరుమంటున్నారు. అయితే, పడిలేచిన కెరటంలా ఉవ్వెత్తున ఎగిసిపడటం చెన్నైకి అలవాటే. 2010లో ఇలాగే చెన్నై వరుసగా నాలుగు మ్యాచ్‌లలో పరాజయం పాలైంది.

అయితే అనూహ్యంగా... ఆ తర్వాత వరుస విజయాలు సాధించి విజేతగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. కానీ పరిస్థితులు ఈసారి భిన్నంగా ఉన్నాయి. ధోని పూర్తిస్థాయి కెప్టెన్‌గా లేడు. మరోవైపు.. ఐపీఎల్‌-2022తో ఎంట్రీ ఇచ్చిన టీమిండియా వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలోని లక్నో సూపర్‌జెయింట్స్‌, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్‌ టైటాన్స్‌ హ్యాట్రిక్‌ విజయాలతో దూసుకుపోతున్నాయి. ప్రత్యర్థి జట్లకు గట్టి షాకిస్తు‍న్నాయి.

సన్‌రైజర్స్‌, పంజాబ్‌ మినహా మిగతా జట్లన్నీ ఇప్పటి వరకు పటిష్ట స్థితిలోనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడింట గెలిచి లక్నో ఆరు పాయింట్ల(రన్‌రేటు- 0.256)తో పట్టికలో నాలుగో స్థానంలో ఉండగా.. గుజరాత్‌ ఇప్పటి వరకు ఓటమన్నదే ఎరుగక హ్యాట్రిక్‌ విజయాల(రన్‌రేటు- 0.349)తో రెండో స్థానంలో నిలిచింది.

ఒక్క మ్యాచ్‌ అయినా గెలవండిరా బాబూ!
ఇలా హేమాహేమీలైన ముంబై, చెన్నై వరుస ఓటములతో పరాభవం మూటగట్టుకోగా... కొత్త జట్లు లక్నో, గుజరాత్‌ రాణిస్తున్న తీరుపై క్రికెట్‌ అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. వ్యంగ్యంతో కూడిన మీమ్స్‌ షేర్‌ చేస్తూ సెటైర్లు వేస్తున్నారు. ‘‘కనీసం ఒక్క మ్యాచ్‌ అయినా గెలవండిరా బాబు! మీరు చాంపియన్లు అని చెప్పుకోవడానికే ఏదోలా ఉంది. సిగ్గుతో చచ్చిపోతున్నాం.

గతమెంత ఘనం అన్నది కాదు.. ఇప్పుడేం చేస్తున్నారో అదే ముఖ్యం. ఆటపై మరింత దృష్టి సారించండి. కొత్త జట్లు రాణిస్తున్న తీరు చూసైనా కాస్త మారండి. రూటు మార్చండి’’ అని సోషల్‌ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. టాస్‌, పిచ్‌ ప్రభావం ఉన్నా సరే.. అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యారని విమర్శిస్తున్నారు.

ఇక శనివారం(ఏప్రిల్‌ 9) నాటి మ్యాచ్‌లలో చెన్నై హైదరాబాద్‌తో, ముంబై ఆర్సీబీతో ఓడిన తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ పేల్చిన సెటైర్‌ వైరల్‌ అవుతోంది. ఇప్పటి వరకు ఐపీఎల్‌-2022లో ముంబై, సీఎస్‌కే పరిస్థితి ఇదీ అంటూ.. మేము ఎప్పుడూ కలిసే ఉంటాం. ఓటమైనా, గెలుపైనా ఒకరి చేతిని ఒకరం వీడము అన్న డైలాగులతో కూడిన ఓ వీడియోను ఆయన షేర్‌ చేశారు. 

Read latest Sakshi Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top