IPL 2022: ఒక్కోసారి మా మీద మాకే డౌట్‌ వస్తుంది.. మూడు విభాగాల్లోనూ..

IPL 2022: CSK Coach Stephen Fleming Says Players Get Little Bit Niggly - Sakshi

IPL 2022 SRH Vs CSK: ‘‘బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌... మూడు విభాగాల్లో మేము చాలా మెరుగుపడాల్సి ఉంది. కొంత మంది కీలక ఆటగాళ్లు జట్టుతో లేని లోటు కూడా స్పష్టంగా కనిపిస్తోంది. స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాం’’ అని ఐపీఎల్‌ జట్టు చెన్నై సూపర్‌కింగ్స్‌ హెడ్‌ కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ అన్నాడు. ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేకపోవడం ఆత్మన్యూనతకు దారి తీస్తుందన్న ఫ్లెమింగ్‌... ఆత్మవిశ్వాసం పోగు చేసుకుని తిరిగి పుంజుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశాడు.

కాగా ఐపీఎల్‌-2022 సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై ఇంత వరకు ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేదు. ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ ఓటమిని మూటగట్టుకుంది. కొత్త సారథి రవీంద్ర జడేజా కెప్టెన్సీలో చెత్త ప్రదర్శనతో విమర్శల పాలవుతోంది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో శనివారం నాటి మ్యాచ్‌లో ఓటమి అనంతరం ఫ్లెమింగ్‌ మీడియాతో మాట్లాడాడు.

ఈ సందర్భంగా... ‘‘మేము ఒక్క మ్యాచ్‌కూడా గెలవలేకపోయాం. కనీసం విజయానికి చేరువగా కూడా వెళ్లలేకపోతున్నాం. ఇలాంటి పరిణామాలు మనపై మనం నమ్మకం కోల్పోయేలా చేస్తాయి. విమర్శల కారణంగా ఆటగాళ్లు కూడా ఢీలా పడే అవకాశం ఉంది. అయితే, మమ్మల్ని మేము మెరుగుపరచుకోవడానికి ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోము. తిరిగి పుంజుకుని టోర్నీలో ముందుకు సాగుతాం’’ అని తెలిపాడు. 

అదే విధంగా దీపక్‌ చహర్‌ వంటి స్టార్‌ ప్లేయర్‌ జట్టులో లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందన్న ఫ్లెమింగ్‌.. ప్రత్యర్థి జట్లను ఒత్తిడిలోకి నెట్టడంలో విఫలమవుతున్నామని పేర్కొన్నాడు. ఏదేమైనా ఇకపై మెరుగ్గా రాణిస్తేనే ప్రయాణం సాఫీగా సాగుతుందని, లేదంటే భంగపాటు తప్పదని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. కాగా హైదరాబాద్‌ చేతిలో సీఎస్‌కే 8 వికెట్ల తేడాతో ఓటమి పాలై వరుసగా నాలుగో పరాజయం నమోదు చేసింది.

సీఎస్‌కే వర్సెస్‌ సన్‌రైజర్స్‌ స్కోర్లు
చెన్నై-154/7 (20)
హైదరాబాద్‌- 155/2 (17.4)

చదవండి: IPL 2022: అతడు భవిష్యత్‌ ఆశా కిరణం: డుప్లెసిస్‌ ప్రశంసలు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top