స్మృతి శకం షురూ... | India Womens first T20 match against Zimbabwe today | Sakshi
Sakshi News home page

స్మృతి శకం షురూ...

Oct 16 2026 4:02 AM | Updated on Oct 16 2026 4:02 AM

India Womens first T20 match against Zimbabwe today

పూర్తి స్థాయి కెప్టెన్‌గా తొలి సిరీస్‌కు రంగం సిద్ధం

నేడు జింబాబ్వేతో భారత మహిళల మొదటి టి20 మ్యాచ్‌

రాయ్‌పూర్‌లో తొలిసారి మహిళల అంతర్జాతీయ పోరు

రాత్రి 7 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

రాయ్‌పూర్‌: భారత మహిళల క్రికెట్‌లో స్మృతి మంధాన శకం షురూ కానుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు జింబాబ్వేతో టీమిండియా తొలి టి20 మ్యాచ్‌ ఆడనుంది. ఏ ఫార్మాట్‌లో అయినా జింబాబ్వేతో భారత్‌ ద్వైపాక్షిక సిరీస్‌ ఆడనుండటం ఇదే తొలిసారి కాగా... రాయ్‌పూర్‌లో మహిళల అంతర్జాతీయ మ్యాచ్‌ జరగనుండటం కూడా ఇదే మొదటిసారి. హర్మన్‌ప్రీత్‌ అందుబాటులో లేని సమయంలో స్మృతి మంధాన ఇప్పటి వరకు 18 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు నాయకత్వం వహించింది. అయితే పూర్తిస్థాయిలో కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న తర్వాత భారత జట్టు ఆడనున్న తొలి సిరీస్‌ ఇదే. 

గత పదేళ్లుగా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌... ఇప్పుడు స్మృతి కెప్టెన్సీలో కేవలం ప్లేయర్‌గా బరిలోకి దిగనుంది. గతేడాది వన్డే వరల్డ్‌కప్‌ సాధించిన భారత జట్టు... టి20 ఫార్మాట్‌లోనూ మెరుగైన ఫలితాలు సాధించాలని ఆశిస్తోంది. ఇటీవల ఆసియా కప్, ఏషియన్‌ గేమ్స్‌లో విజృంభించి విజేతగా నిలిచిన టీమిండియా... అదే జోరు కొనసాగించాలని భావిస్తుండగా... ఏడాది కాలంగా ఈ ఫార్మాట్‌లో ఒక్క విజయం కూడా నమోదు చేయని జింబాబ్వే ఏమాత్రం పోటీనిస్తుందో చూడాలి. రాయ్‌పూర్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించనుండగా... మ్యాచ్‌కు వర్ష సూచనలేదు.  

ఓపెనర్లు ఫుల్‌ ఫామ్‌లో...  
ఇటీవలి సిరీస్‌లు పరిశీలిస్తే భారత జట్టుకు బ్యాటింగ్‌లో పెద్దగా సమస్యలు కనిపించడం లేదు. ఆసియా స్థాయిలో టీమిండియాకు గట్టి పోటీనిచ్చే జట్టు లేకపోవడంతో ఆసియా కప్, ఏషియన్‌ గేమ్స్‌లో భారత్‌ అలవోకగా విజయాలు సాధించింది. 64, 68, 40, 100, 48... ఇవి గత ఐదు మ్యాచ్‌ల్లో ఓపెనర్‌ షఫాలీ వర్మ చేసిన స్కోర్లు ఇవి. జింబాబ్వేతో సిరీస్‌లో కూడా షఫాలీ ఇదే దూకుడు కొనసాగించాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. మరో ఓపెనర్‌గా దిగనున్న కెప్టెన్‌ స్మృతి మంధాన కూడా మంచి టచ్‌లో ఉండగా... మూడో స్థానంలో ఎవరు ఆడతారనేదే సమస్యగా మారింది. 

జెమీమా రోడ్రిగ్స్‌ గాయం నుంచి కోలుకోకపోవడంతో... పలువురు ప్లేయర్లకు అవకాశం ఇచ్చినా ఎవరూ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. శుక్రవారం పోరులో అనుష్క శర్మ, నిక్కీ ప్రసాద్‌లో ఒకరిని పరిశీలించవచ్చు. హర్మన్‌ప్రీత్, రిచా ఘోష్, భారతి ఫుల్మాలి, దీప్తి శర్మలతో మిడిలార్డర్‌ బలంగా ఉంది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత హర్మన్‌ మరింత ధాటిగా ఆడాలని అభిమానులు ఆశిస్తున్నారు. బౌలింగ్‌లో ఆంధ్ర స్పిన్నర్‌ శ్రీచరణిపై అందరి దృష్టి నిలవనుంది. ఈ ఏడాది 23 టి20 మ్యాచ్‌లు ఆడిన శ్రీచరణి 47 వికెట్లు పడగొట్టి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఆమెతో పాటు ప్రేమ రావత్, దీప్తి స్పిన్‌ బాధ్యతలు పంచుకోనుండగా... నందని శర్మ, క్రాంతి గౌడ్‌ పేస్‌ భారం మోయనున్నారు.  

పోటీనిచ్చేనా... 
మరోవైపు జింబాబ్వే జట్టు ఈ ఏడాది ఒక్క టి20 మ్యాచ్‌లోనూ గెలవలేకపోయింది. ఆడిన 18 టి20ల్లోనూ ఓడింది. ఈ ఏడాది జూన్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన తర్వాత భారత జట్టు వరుసగా ఎనిమిది టి20ల్లో గెలవగా... జింబాబ్వే జట్టు గతేడాది సెప్టెంబర్‌లో నమీబియాపై చివరి విజయం నమోదు చేసుకుంది. ఓపెనర్‌ కెలిస్, కెప్టెన్‌ జోస్‌పైన్‌కు మంచి అనుభవం ఉంది. ఎలాంటి అంచనాల ఒత్తిడి లేకుండా బరిలోకి దిగనుండటం జింబాబ్వేకు అనుకూలించే అంశం.

ఇది మరీ కొత్త విషయమేమీ కాదు. గతంలోనూ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించా. అయితే పూర్తిస్థాయి కెప్టెన్‌గా తొలి సిరీస్‌ కావడంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. జింబాబ్వేతో తలపడనుండటం ఇదే మొదటిసారి. ఇలాంటి జట్లతో ఆడే సమయంలో ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఎందుకంటే వారు ఆటను బాగా ఆస్వాదిస్తారు. –స్మృతి మంధాన, భారత కెప్టెన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement