IND W Vs ENG W: 23 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌ గడ్డపై కొత్త చరిత్ర

India Womens Beat England By-88 Runs Clinch Series 2-0 After 23 Years - Sakshi

ఇంగ్లండ్‌ గడ్డపై టీమిండియా మహిళలు సరికొత్త చరిత్ర సృష్టించారు. దాదాపు 23 ఏళ్ల తర్వాత బ్రిటీష్‌ గడ్డపై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్నారు. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌తో  ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది. భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (111 బంతుల్లో 143 నాటౌట్‌; 18 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగింది.

ఓపెనర్‌ షఫాలీ వర్మ (8) నిరాశపరచగా, స్మృతి మంధాన (51 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్స్‌), యస్తిక భాటియా (34 బంతుల్లో 26; 4 ఫోర్లు) రెండో వికెట్‌కు 54 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 66 పరుగుల వద్ద యస్తిక నిష్క్రమించడంతో క్రీజులోకి వచ్చిన హర్మన్‌ మొదట కుదురుగా ఆడింది. తర్వాత దూకుడు పెంచింది. ఇక ఆఖర్లో చుక్కలు చూపించింది. 64 బంతుల్లో ఫిఫ్టీ (4 ఫోర్లు, 1 సిక్స్‌) పూర్తి చేసుకున్న హర్మన్‌ వంద బంతుల్లో సెంచరీ (12 ఫోర్లు, 1 సిక్స్‌) సాధించింది.

ఆమె వన్డే కెరీర్‌లో ఇది ఐదో శతకం. తర్వాత 11 బంతుల్లోనే 43 పరుగులు ధనాధన్‌గా చేసింది. 6 ఫోర్లు, 3 సిక్సర్ల రూపంలోనే 42 పరుగులు వచ్చాయి. హర్లీన్‌ డియోల్‌ (72 బంతుల్లో 58; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అండగా నిలిచింది. పూజ వస్త్రకర్‌ (18) తక్కువ స్కోరే చేయగా, దీప్తి శర్మ (9 బంతుల్లో 15 నాటౌట్‌; 2 ఫోర్లు) కెప్టెన్‌తో కలిసి అజేయంగా నిలిచింది.

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ జట్టు 44.2 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. డేనియల్‌ వ్యాట్‌ 65 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. అలిస్‌ కాప్సీ 39, చార్లెట్‌ డీన్‌ 37 పరుగులు చేశారు. టీమిండియా మహిళా బౌలర్లలో రేణుకా సింగ్‌ 4 వికెట్లు, దయాలన్‌ హేమలత 2, దీప్తి శర్మ, షఫాలీ వర్మ తలా ఒక వికెట్‌ తీశారు. ఈ విజయంతో టీమిండియా మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

ఇక ఝులన్‌ గోస్వామికి ఈ విజయంతో టీమిండియా మహిళల జట్టు ఘనమైన వీడ్కోలు పలికినట్లయింది. ఇక నామమాత్రంగా మారిన చివరి వన్డే సెప్టెంబర్‌ 24న(శనివారం) జరగనుంది. అయితే వచ్చే వన్డే వరల్డ్‌కప్‌ 2023 వరకు టీమిండియాకు మరో వన్డే సిరీస్‌ ఆడే అవకాశం లేదు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top