Ind Vs WI ODI Series: వీళ్లతో అంత వీజీ కాదు! ఏమరపాటుగా ఉంటే మూల్యం చెల్లించకతప్పదు!

Ind Vs WI ODI Series: 3 Players Who Can Pose Challenge To Indian Side - Sakshi

India tour of West Indies, 2022: వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా పలువురు టీమిండియా యువ బ్యాటర్లకు వన్డే జట్టులో చోటు దక్కింది. భారత జట్టు రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, ఇతర కీలక బ్యాటర్లు విరాట్‌ కోహ్లి, రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్యా తదితరులకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో.. ఈ సిరీస్‌ ద్వారా తామేంటో నిరూపించుకునే అవకాశం దొరికింది. 

ఇక పాకిస్తాన్‌ పర్యటనలో, స్వదేశంలో బంగ్లాదేశ్‌ చేతిలో చిత్తై డీలా పడిన విండీస్‌ను.. ఓడించడం శిఖర్‌ ధావన్‌ సారథ్యంలోని టీమిండియాకు పెద్ద కష్టమేమీ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నా.. టీమిండియా యువ బాట్యర్లకు ఈ ముగ్గురు విండీస్‌ బౌలర్లను ఎదుర్కోవడం అంత తేలికేమీ కాదు.

అకీల్‌ హొసేన్‌
గతేడాది ఆరంభంలో బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అకీల్‌ హొసేన్‌. ఆరంభంలో కాస్త తడబడ్డా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో ముగిసిన సిరీస్‌లో కేవలం ఒకే ఒక వికెట్‌ తీసినా.. ప్రస్తుత వన్డే సూపర్‌ లీగ్‌ భాగంగా ఆడిన 20 ఇన్నింగ్స్‌లో ఏకంగా 35 వికెట్లు పడగొట్టాడు.

తద్వారా లీగ్‌లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు 29 ఏళ్ల అకీల్‌. టీమిండియా బ్యాటర్లకు అకీల్‌ సవాల్‌ విసురుతాడనడంలో సందేహం లేదు. ముఖ్యంగా అకీల్‌ ఫామ్‌లోకి వస్తే రైట్‌ హ్యాండ్‌ బ్యాటర్లకు అతడితో తలనొప్పి తప్పదు.

గుడకేశ్‌ మోటీ
బంగ్లాదేశ్‌తో స్వదేశంలో ముగిసిన వన్డే సిరీస్‌తో అరంగేట్రం చేశాడు గుడకేశ్‌ మోటీ. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో అతడు ఆరు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. తన లెఫ్టార్మ్‌ స్పిన్‌తో బ్యాటర్లను తిప్పలు పెట్టాడు. 

కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో నికోలస్‌ పూరన్‌ సారథ్యంలో ఆడిన మోటీకి టీమిండియాతో సిరీస్‌లో తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు మెండు. అదే జరిగితే 27 ఏళ్ల లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ను ఎదుర్కోవడం భారత బ్యాటర్లకు అంత సులువేమీ కాదు.

జేడెన్‌ సీల్స్‌
ఫాస్ట్‌ బౌలర్‌ జేడెన్‌ సీల్స్‌ ఈ ఏడాది నెదర్లాండ్స్‌తో సిరీస్‌తో అంతర్జాతీయ వన్డేల్లో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో అవకాశం దక్కించుకున్న అతడికి కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో ఆడే ఛాన్స్‌ దక్కింది. అయితే బంతిని స్వింగ్‌ చేస్తూ జేడెన్‌ మంచి ఫలితాలు రాబట్టగలడు. ముఖ్యంగా ఈ 20 ఏళ్ల యువ పేసర్‌ డెత్‌ ఓవర్లలో యార్కర్లతో బ్యాటర్లను ఇబ్బందిపెట్టగలడు.

కరేబియన్‌, లంక ప్రీమియర్‌ లీగ్‌లో అతడు రాణించిన విధానమే ఇందుకు నిదర్శనం. ఆండర్సన్‌ ఫిలిప్‌తో పాటు రొమారియో షెఫర్డ్‌ వన్డే సిరీస్‌కు దూరమైన నేపథ్యంలో జేడెన్‌కు తుదిజట్టులో అవకాశం రావడం ఖాయంగానే కనిపిస్తోంది.. కాబట్టి అతడి బౌలింగ్‌లో కాస్త ఆచితూచి ఆడకపోతే టీమిండియా యువ బ్యాటర్లు మూల్యం చెల్లించకతప్పదు. ఇక జూలై 22 నుంచి టీమిండియా- వెస్టిండీస్‌ జట్ల మధ్య వన్డే సిరీస్‌ ఆరంభం కానున్న విషయం తెలిసిందే.

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు:
శిఖర్‌ ధావన్‌(కెప్టెన్‌), రవీంద్ర జడేజా(వైస్‌ కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, శుబ్‌మన్‌ గిల్‌, దీపక్‌ హుడా, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌(వికెట్‌ కీపర్‌), సంజూ శాంసన్‌(వికెట్‌ కీపర్‌), శార్దూల్‌ ఠాకూర్‌, యజువేంద్ర చహల్‌, అక్షర్‌ పటేల్‌, ఆవేశ్‌ ఖాన్‌, ప్రసిద్‌ కృష్ణ, మహ్మద్‌ సిరాజ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.

భారత్‌తో వన్డేలకు వెస్టిండీస్ జట్టు: 
నికోలస్ పూరన్ (కెప్టెన్), షాయ్ హోప్ (వైస్ కెప్టెన్), షమర్ బ్రూక్స్, కీసీ కార్టీ, జాసన్ హోల్డర్, అకీల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడకేష్ మోటీ, కీమో పాల్, రోవ్‌మన్ పావెల్, జేడెన్ సీల్స్

చదవండి: Ind Vs WI ODI Series: వన్డేల్లో అరంగేట్రం చేయాలి.. ఓపెనర్‌గా రావాలి! అతడికి ఆ అర్హత ఉంది!
India Vs West Indies 2022: విండీస్‌తో టీమిండియా వన్డే, టీ20 సిరీస్‌.. షెడ్యూల్‌, జట్లు, పూర్తి వివరాలు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top