 
															మైదానంలోకి దూసుకువచ్చి పోలీసులను పరుగులు పెట్టించారు(PC: Social Media)
అతడంటే ‘పిచ్చి’.. ప్లీజ్ ఒక సెల్ఫీ.. మైదానంలోకి దూసుకువచ్చి పోలీసులనే పరుగెత్తించారు!
Ind VS Sl 2nd Test- Virat Kohli: అభిమానులు పలురకాలు.. వారిలో ఈ ముగ్గురు కొంచెం స్పెషల్... తమ ఆరాధ్య క్రికెటర్ ‘కింగ్’ విరాట్ కోహ్లిని చూసేందుకు ఏకంగా మైదానంలోకి దూసుకువచ్చారు. భద్రతా సిబ్బందిని దాటుకుని లోపలికి వచ్చి నానా హంగామా చేశారు. పోలీసులు, సిబ్బందిని గ్రౌండ్ మొత్తం పరుగులు పెట్టించారు. బెంగళూరు వేదికగా టీమిండియా- శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా పింక్‌బాల్ టెస్టు నేపథ్యంలో రెండో రోజు టీమిండియా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు ఒక్కసారిగా మైదానంలోకి పరుగెత్తుకొచ్చారు. స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లి దగ్గరకు వెళ్లి సెల్ఫీ ఇవ్వాలని కోరారు. ఈ హఠాత్పరిణామంతో కంగుతిన్న భద్రతా సిబ్బంది, పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయారు. కానీ చివరకు దొరికిపోయారు.
ఇక ఈ ఘటనపై స్పందించిన నెటిజన్లు.. ‘‘ఇదేం పిచ్చిరా నాయనా.. కావాలంటే బయటకు వెళ్లేటప్పుడు ఫొటో తీసుకువచ్చు కదా! మరీ ఇలా మైదానంలోకి దూసుకువెళ్లాలా?’’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కాగా క్రికెట్ మ్యాచ్ సందర్భంగా గతంలో ఇలాంటి ఘటనలెన్నో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కాగా శ్రీలంకతో రెండో టెస్టులోనూ కోహ్లి మరోసారి నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 23, రెండో ఇన్నింగ్స్‌లో 13 పరుగులకే పెవిలియన్ చేరాడు. కనీసం అర్ధ శతకం కూడా సాధించలేక అభిమానులను ఉసూరుమనిపించాడు.
Fans entered in the ground to take selfie with #viratkohli #Virat #Kohli #IndvsSL pic.twitter.com/jygYxZhKRR
— TRENDING CRIC ZONE (@rishabhgautam81) March 13, 2022

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
