
తహసీల్దార్ కార్యాలయానికి తాళం
అద్దె చెల్లించడం లేదని యజమాని ఆగ్రహం
కల్హేర్(నారాయణఖేడ్): అద్దె డబ్బులు చెల్లించడంలేదని సదరు భవన యజమాని తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేశారు. సిర్గాపూర్ మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం ఘటన జరిగింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హాయాంలో సిర్గాపూర్ మండలంగా ఏర్పాటు చేయగా అప్పట్లో అధికారులు ప్రైవేట్ భవనంలో తహసీల్దార్ కార్యాలయాన్ని నిర్వహించారు. అదే భవనంలో దాదాపు ఎనిమిదేళ్ల నుంచి తహసీల్దార్ కార్యాలయం కొనసాగుతున్నా ప్రభుత్వం మాత్రం అద్దె డబ్బులు చెల్లించడం లేదు. దాదాపు 2 ఏళ్ల నుంచి రూ. 5 లక్షల వరకు అద్దె డబ్బులు చెల్లించాలి. దీంతో భవన యజమాని నర్సమ్మ అద్దె డబ్బులు చెల్లించాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదు. ఈ క్రమంలో మంగళవారం తహసీల్దార్ కార్యాలయం వద్దకు వెళ్లిన నర్సమ్మ అధికారులను బయటికి పంపించి తాళం వేసింది. సాయంత్రం కార్యాలయం పని వేళలు ముగిశాయని చెబుతూ తహసీల్దార్ నజీంఖాన్, సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. తాళం వేసిన విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తామని నజీంఖాన్ తెలిపారు. గతంలోనూ అద్దె డబ్బులు చెల్లించడంలేదని తాళం వేసిన ఘటన జరిగింది. తహసీల్దార్ కార్యాలయానికి తరుచుగా తాళం వేయడంతో మండల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.